1200 ఫైటర్లతో చరణ్ పోరాటం

ఆర్ఆర్ఆర్ ఇంట్రడక్షన్ సీన్ లో వేలాది జనం మధ్య తను టార్గెట్ చేసినవాడిని పట్టుకొచ్చి పైఅధికారి ముందు పడేసిన రామరాజు పాత్రను మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. టాలీవుడ్ బెస్ట్ ఇంట్రోస్ లో ఒకటిగా దీన్ని చెప్పుకుంటారు. అంతకు ముందు ఇదే రాజమౌళి తీసిన మగధీరలో వంద మందితో పోరాటం చేస్తే ఇప్పుడా నెంబర్ థౌసండ్ దాటేసింది. ఇక్కడితో అయిపోలేదు. రాబోయే శంకర్ సినిమాలోనూ ఇలాంటి టెర్రిఫిక్ బ్లాక్ ఒకటి మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారట

సుమారు 1200 ఫైటర్లతో రామ్ చరణ్ పోరాడే ఎపిసోడ్ ఆర్ సి 15లో ప్రధాన హై లైట్ గా నిలుస్తుందని తెలిసింది. అపరిచితుడు, రోబోలో ఈ తరహా సీన్లు ఉన్నప్పటికీ ఇంత కౌంట్ అయితే కాదు. చాలా కాలం తర్వాత వింటేజ్ శంకర్ ని చూడబోతున్నారని అక్కడి యూనిట్ లో పని చేసిన వారి నుంచి అందుతున్న సమాచారం. ఇది పావు గంట పైనే ఉంటుందని అంటున్నారు. బడ్జెట్ ఊహకందడం కష్టమే. దీన్ని 20 రోజుల పాటు హైదరాబాద్ లోనే షూట్ చేయబోతున్నారు. ఇది చేస్తే అక్కడికి డెబ్భై శాతం దాకా కంప్లీట్ అయినట్టే.

ఇదొక్కటే కాదు చరణ్ కియారా అద్వానీల మీద చిత్రీకరించబోయే పాటలోనూ వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు డాన్సర్ లు ఉంటారని చెబుతున్నారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ సాంగ్ ని పంజాబ్ లో మూడు రోజులు షూట్ చేసి బ్యాలన్స్ ని హైదరాబాద్ స్టూడియోలో ఆరు రోజుల పాటు కొనసాగిస్తారు. మొత్తానికి శంకర్ ఊహించిన దానికన్నా గ్రాండ్ స్కేల్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు 2023 వేసవి రిలీజ్ కి ప్లాన్ చేశారట. తమన్ సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ కాబోతోంది.