చిరంజీవి లోపాన్ని దిద్దిన ఆ పెద్దాయన

గుడిపూడి శ్రీహరి.. తెలుగులో సీనియర్ మోస్ట్ సినీ జర్నలిస్టుల్లో ఒకరు. నిన్నటి తరం ఫిలిం సెలబ్రెటీలందరికీ ఆయనెంతో గౌరవం. అలాగే సినిమా జర్నలిస్టులకు ఆయన ఆదర్శం. నిర్మాణాత్మకమైన విమర్శతో కూడిన ఆయన సినిమా రివ్యూలకు అప్పట్లో చాలా మంచి పేరుండేది.

‘సితార’లో ఆయన రివ్యూల కోసమే ఆ పత్రిక కొనేవాళ్లు అప్పట్లో. రాజమౌళి లాంటి లెజెండ్ ఓ సందర్భంలో తనకు నచ్చిన సినీ జర్నలిస్టుగా గుడిపూడి శ్రీహరి పేరు చెప్పాడు. ఆయన రివ్యూలను తాను ఫాలో అయ్యేవాడినని వెల్లడించాడు. ఈ దిగ్గజ సినీ జర్నలిస్టు మంగళవారం ఉదయం మరణించారు.

హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారాయన. వెంటనే టాలీవుడ్ సినీ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయగా.. దానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా గుడిపూడి శ్రీహరితో తనకున్న అనుబంధం, ఆయన వల్ల తాను దిద్దుకున్న ఒక లోపం గురించి వెల్లడించారు.

తన సినీ కెరీర్ ఎదుగుదలలో గుడిపూడి శ్రీహరి సహా కొందరు సినీ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించినట్లు చిరంజీవి వెల్లడించారు. వీళ్లంతా తన సినిమా సెట్‌కు వచ్చి సుదీర్ఘంగా మాట్లాడేవారని.. నిర్మాణాత్మకమైన విమర్శ చేసేవారని.. తప్పొప్పులు చెప్పి వాటిని సరిదిద్దేవారని చిరు అన్నారు.

శ్రీహరి సితారలో రాసిన రివ్యూలను తాను చదివేవాడినని.. కొన్నిసార్లు ఆయన మాటలు కఠినంగా ఉండేవని.. పదజాలం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. అది ఒక టీచర్ పిల్లాడికి పాఠం చెబుతున్నట్లు ఉండేదని.. అలా ఓ సందర్భంలో తన సినిమా రివ్యూ రాస్తూ తన గురించి అన్నీ పాజిటివ్‌గా చెప్పి.. డైలాగ్ డెలివరీ విషయం తప్పుబట్టారని చిరు చెప్పారు.

డ్యాన్సులు, ఫైట్లు లాంటివి వేగంగా ఉండొచ్చని.. కానీ మాట వేగంగా ఉంటే ప్రేక్షకుడికి డైలాగ్ అర్థం కాదని ఆయన చెప్పారని.. తర్వాత ఆయన్ని సెట్‌కు పిలిపించుకుని దీని గురించి అడిగితే వివరంగా చెప్పారని.. దీంతో తాను డైలాగ్ డెలివరీ విషయంలో స్పీడు తగ్గించి ప్రేక్షకుల మెప్పు పొందానని.. ఇలా ఆయన తన లోపాన్ని సరిదిద్దారని చిరు గుర్తు చేసుకున్నారు.