కమర్షియల్ సినిమాల్లో ఎన్ని పాత్రలు చేసినా పోలీస్ డ్రెస్ లో హీరోయిజం చూపిస్తే ఆ కిక్కే వేరు. రాజశేఖర్ కు లైఫ్ ఇచ్చిన అంకుశం తీసుకున్నా, డబ్బింగులు చెప్పుకునే సాయికుమార్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసిన పోలీస్ స్టోరీ చూసుకున్నా, విజయశాంతికి లేడీ అమితాబ్ బిరుదు వచ్చేలా చేసిన కర్తవ్యం ఉదాహరణగా తీసుకున్నా అన్నింటిలో ఉన్న కామన్ పాయింట్ పోలీస్ డ్రెస్. మొన్నటికి మొన్న రవితేజకు కం బ్యాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన క్రాక్ లో ఉన్నది కూడా ఈ నేపధ్యమే.అంతగా ఆ యునిఫార్మ్ ప్రభావం మనమీదుంది.
కాకపోతే ఈ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ వెరైటీ చేసే అవకాశం లేకపోవడం వల్ల రెగ్యులర్ గా పోలీస్ కథలను మనవాళ్ళు ఎంచుకోరు. కానీ లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే కుర్ర హీరోలు మళ్ళీ దాని మీద మనసు పారేసుకున్నట్టు కనిపిస్తోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న ది వారియర్ లో రామ్ తన ఎనర్జీని పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. సాఫ్ట్ అండ్ స్వీట్ మూవీస్ ఎక్కువగా చేసే శ్రీవిష్ణు సైతం ఎన్నడూ లేనిది కొత్తగా అల్లూరి అంటూ మీసాలు మెలేసి ఖాకీ బట్టలతో విలన్లకు నక్సలైట్లకు సవాల్ విసరబోతున్నాడు.
అడవి శేష్ చేసిన హిట్ కేస్ 2లో హీరో పాత్ర పోలీసే. ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపు కాదు కాబట్టి ఫ్రెష్ స్టోరీతో వస్తున్నాడు. విశాల్ లాఠీలోనూ ఇదే ట్రై చేస్తున్నాడు. చూస్తుంటే యూత్ హీరోలు తమ వయసు ముప్పై దాటాక ఈ టైపు క్యారెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. సరిగా వాడాలే కానీ ఇదో మంచి సక్సెస్ ఫుల్ ఫార్ములా. ఫ్లాపే ఎరుగని అనిల్ రావిపూడి డెబ్యూ చేసిన పటాస్ లో ఉన్నది ఇదేగా. ఇవన్నీ రాబోయే రెండు మూడు నెలల్లో థియేటర్లను పోలీస్ స్టేషన్ లుగా మార్చే సినిమాలే. చూద్దాం ఎవరు గెలుస్తారో!