మూడు రాజధానులపై మారుతి పంచ్

సినిమా వాళ్లు చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. తమ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్లు, డైలాగుల్లో పొలిటికల్ టచ్ ఉంటే లేని పోని తలనొప్పులు తప్పవు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతిదీ వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయంతో ఉంటారు ఫిలిం మేకర్స్.

ఐతే ఇటీవల ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబుతో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే వైఎస్ జగన్‌కు అనుకూలమైన డైలాగ్ చెప్పించి పెద్ద చర్చకు తావిచ్చాడు దర్శకుడు పరశురామ్. ఈ డైలాగ్ వల్ల వైసీపీ వాళ్లు ‘సర్కారు వారి పాట’ను ఓన్ చేసుకుంటే.. మిగతా పార్టీల మద్దతుదారులు ఆ చిత్రాన్ని టార్గెట్ చేశారు. మొత్తంగా ఆ డైలాగ్ వల్ల లాభమో, నష్టమో చెప్పలేని పరిస్థితి తలెత్తింది. ఐతే ఇప్పుడు మారుతి తన ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఒక పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఏపీలో వైఎస్ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన ఎంత వివాదస్పదం అయిందో తెలిసిందే. దీని వల్ల లేనిపోని గందరగోళం తలెత్తి.. చివరికి కోర్టు ఆదేశాలతో ఆ ప్రతిపాదనను అటకెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే.. జగన్ అండ్ కో మాత్రం ఈ విషయంలో మొండి పట్టుదలతోనే కనిపిస్తోంది. ఈ మూడు రాజధానుల టాపిక్ మీద ఓ సీన్లో ఒక సెటైరికల్ డైలాగ్ పెట్టాడు మారుతి. కోర్టులో నడిచే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తికి తన భార్య ద్వారా పిల్లలు పుట్టకుంటే.. అమరావతితో వర్కవుట్ కాలేదని వైజాగ్‌లో ఉన్న అమ్మాయి దగ్గరికెళ్లాడని.. అక్కడా పని జరక్కపోతే కర్నూలుకు చెందిన అమ్మాయితో వెళ్లిపోయాడని చెప్పించాడు మారుతి. ఇక్కడ డైరెక్టుగా రాజధానులు అనే మాటను కూడా మారుతి వాడడం విశేషం.

సీన్ మొత్తంగా చూస్తే ఇది సెటైరికల్‌గా పెట్టిన డైలాగే అని అర్థం చేసుకోవచ్చు. మారుతి అంటే మెగా క్యాంపుకి చెందిన డైరెక్టర్. ఆ ఫ్యామిలీ జనసేన పార్టీకి అనుకూలం. మారుతి సైతం తెర వెనుక ఆ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తుంటాడనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల డైలాగ్‌తో జగన్ సర్కారు మీద అతను పంచ్ వేశాడన్నది స్పష్టం. దీన్ని వైసీపీ వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.