పోలీస్ సినిమాలు తీసినందుకు ద‌ర్శ‌కుడి విచారం

ద‌క్షిణాదిన పోలీస్ క‌థ‌ల్ని భ‌లేగా డీల్ చేస్తాడ‌ని పేరున్న ద‌ర్శ‌కుడు హ‌రి. ఒక‌ప్ప‌టి హీరోయిన్ రుక్మిణికి భ‌ర్త‌, సీనియ‌ర్ న‌టుడు విజ‌య్‌కుమార్‌కు అల్లుడు అయిన హ‌రి.. ఊర మాస్ సినిమాలతో భారీ హిట్లే కొట్టాడు. అందులో సామి, సింగం ప్ర‌త్యేకం. ఇవి రెండూ పోలీస్ క‌థ‌లే అన్న సంగ‌తి తెలిసిందే. పోలీస్ సినిమాలంటే ఇలా ఉండాలి అనేలా అవి తెర‌కెక్కాయి.

ఆ రెండు చిత్రాల్లోనూ హీరో పాత్ర‌ల్ని చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా డిజైన్ చేసి పోలీసుల మీద పాజిటివ్ ఫీలింగ్ క‌లిగేలా చేశాడు హ‌రి. సామికి కొన‌సాగింపుగా ఓ చిత్రం.. సింగం సిరీస్‌ను కొన‌సాగిస్తూ మ‌రో రెండు సినిమాలు తీశాడు హ‌రి. హ‌రి-సూర్య కాంబినేష‌న్లో రాబోయే కొత్త చిత్రం కూడా పోలీస్ స్టోరీనే కావ‌చ్చ‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో హ‌రి ఓ ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌క‌ట‌న చేశాడు. పోలీస్ పాత్ర‌ల్ని ఎలివేట్ చేస్తూ తాను ఐదు సినిమాలు తీయ‌డం ప‌ట్ల అత‌ను విచారం వ్య‌క్తం చేశాడు. త‌మిళ‌నాడులోని తూత్తుకుడి జిల్లాలో జ‌య‌రాజ్, ఫీనిక్స్ అనే తండ్రీ కొడుకులు లాక్ డౌన్ టైంలో నిర్ణీత స‌మ‌యాన్ని దాటి షాప్ తెరిచి ఉన్నార‌న్న కార‌ణంతో పోలీసులు వారిని దండించ‌డం.. ఈ క్ర‌మంలో మాటా మాటా పెరిగి వారిని పోలీసులు తీసుకెళ్లి చిత్ర‌వ‌ధ చేసి ఇద్ద‌రి మ‌ర‌ణాల‌కు కార‌ణం కావ‌డం.. ఈ ఉదంతంపై పెద్ద దుమారం రేగడం తెలిసిన సంగ‌తే.

ఈ నేప‌థ్యంలో సెల‌బ్రెటీలంద‌రూ పోలీసుల అకృత్యాల మీద మండిప‌డుతూ సోష‌ల్ మీడియాలో ఉద్య‌మంలో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే హ‌రి పోలీసుల్ని ఎలివేట్ చేసేలా సినిమాలు తీయ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇక‌పై జ‌య‌రాజ్, పీనిక్స్‌ల మాదిరి ఇంకెవ్వ‌రూ అన్యాయానికి గురి కాకూడ‌ద‌ని అత‌ను అభిల‌షించాడు.