సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు యూత్‌ను పిచ్చెక్కించేస్తున్న పేరిది. డీజే టిల్లుతో అతను మామూలు రచ్చ చేయలేదు. ఈ సినిమాలో హీరోగానే కాదు.. రైటర్ కూడా అతను జనాలకు తెగ నచ్చేశాడు. ఆ పాత్ర జనాలకు అంతగా ఎక్కేసిందంటే సిద్ధునే ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే వెళ్లిపోయింది.
ఈ సినిమా తనకిచ్చిన గుర్తింపు, విజయాన్ని చూసి స్వయంగా సిద్ధునే ఆశ్చర్యపోయాడు. దీంతో తాను ఒప్పుకున్న వేరే సినిమాలు వదులుకుని మరీ డీజే టిల్లు-2 చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్టు కూడా రెడీ అయిపోయింది. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందని నిర్మాత నాగవంశీ ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఐతే చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డీజే టిల్లు-2కు దర్శకుడు కూడా సిద్ధునే అట. ఫస్ట్ పార్ట్‌కు సిద్ధు కథ మాటలు అందించాడు. స్క్రీన్ ప్లేలోనూ భాగం పంచుకున్నాడు. కాబట్టి ఈసారి కూడా అవే బాధ్యతలు నిర్వర్తిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈసారి అతను మెగా ఫోన్ కూడా పట్టేస్తున్నాడట. ఫస్ట్ పార్ట్‌కు అన్నీ తానై వ్యవహరించిన నేపథ్యంలో.. డైరెక్షన్ చేయడం కష్టమేమీ కాదని అతను భావిస్తుండొచ్చు.
నిజానికి విమల్ కృష్ణనే దర్శకుడిగా కొనసాగించాలని అనుకున్నప్పటికీ అతడికి వేరే కమిట్మెంట్ ఉండడంతో అతను ఈ ప్రాజెక్టు చేయలేకపోయాడంటున్నారు. అడివి శేష్ తరహాలోనే సిద్ధుకు రచనలో, సినిమా మేకింగ్‌లో మంచి పట్టుంది. అతను కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాకు కూడా స్క్రిప్టులో, మేకింగ్‌లో కీలకంగా ఉన్నాడు. ఆ తర్వాత మా వింత గాథ వినుమాకు కూడా అన్నీ తానై వ్యవహరించాడు. కాబట్టి ఈ అనుభవంతో డైరెక్షన్ చేయడం అతడికి కష్టం కాకపోవచ్చు.