కొవిడ్ కొట్టిన దెబ్బకు మామూలుగా కుదేలవ్వలేదు బాలీవుడ్. దాదాపు ఏడాదిన్నర పాటు ఉత్తరాదిన మెజారిటీ థియేటర్లు మూతపడి ఉండడంతో బాలీవుడ్ వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. థియేటర్లు పునఃప్రారంభమయ్యేసరికి ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయి సినిమా బాగున్నా కూడా థియేటర్లకు రాని పరిస్థితి తలెత్తింది.
కరోనా టైంలో మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దక్షిణాది చిత్రాలకు అలవాటు పడిపోయి.. హిందీ సినిమాలు వారికి రుచించని పరిస్థితి తలెత్తింది. ఎప్పుడో ఓ సినిమా మాత్రమే బాగా ఆడుతోంది తప్ప.. చాలా వరకు హిందీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. కొత్త ఏడాదిలో కశ్మీర్ ఫైల్స్, భూల్ భులాయియా-2 మినహాయిస్తే హిట్లే లేవు. పెద్ద హీరోలు నటించి, మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఆడకపోవడం బాలీవుడ్‌ను బెంబేలెత్తించింది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్లో వచ్చిన జగ్ జగ్ జీయో మీద అందరి దృష్టీ నిలిచింది.
వరుణ్ ధావన్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, నీతూ కపూర్ లాంటి పేరున్న తారాగణం నటించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రానికి ప్రి రిలీజ్ హైప్ బాగానే కలిసొచ్చింది. అజయ్ దేవగణ్ లాంటి స్టార్ నటించి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రన్ వే 34కు తొలి రోజు మూడున్నర కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాగా.. జగ్ జగ్ జీయో రూ.9.5 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ ఊపును రెండో రోజు కూడా ఈ చిత్రం కొనసాగించింది.
శనివారం రూ.12 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో లేదా ఇంతకంటే మించి కలెక్షన్లు వచ్చే అవకాశముంది. ఈ మిడ్ రేంజ్ మూవీకి వీకెండ్లో రూ.30 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయంటే హిట్ స్టేటస్ అందుకోబోతున్నట్లే. కాకపోతే ఈ సినిమా క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రమే ఆకర్షిస్తోంది. మాస్ ప్రేక్షకులు మాత్రం ఇంకా భూల్ భులాయియా-2 చూసేందుకే మొగ్గు చూపుతున్నారు.