ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘డీజే టిల్లు’. పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని తెచ్చి పెట్టిందా చిత్రం. నిజానికి ఈ సినిమాకు అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. రివ్యూలన్నీ మిక్స్‌డ్‌గా వచ్చాయి. అయినా ఈ చిత్రం నెగెటివిటీని అధిగమించి బ్లాక్‌బస్టర్ అయింది. యూత్‌కు ఈ చిత్రంలోని డీజే టిల్లు క్యారెక్టర్ మామూలుగా ఎక్కలేదు. సిద్ధు జొన్నలగొడ్డ ఒక్కసారిగా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
సినిమా రిలీజ్ తర్వాత ఈ పాత్ర జనాల గుండెల్లోకి దూసుకెళ్లిపోయింది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో డీజే టిల్లు ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా, క్యారెక్టర్ రీచ్ చూసి సిద్ధు అండ్ టీం ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇందుకోసం సిద్ధు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు.
టిల్లు క్యారెక్టర్ తర్వాత మరే పాత్ర చేసినా.. జనాలకు ఆనదని, ప్రేక్షకుల్లో ఆ హ్యాంగోవర్ అలాగే కంటిన్యూ అవ్వాలని, మళ్లీ టిల్లు పాత్రతోనే వాళ్లను పలకరించాలని డిసైడయ్యాడు. అందుకే ‘కప్పెల’ రీమేక్‌తో పాటు తాను ఒప్పుకున్న మరో చిత్రాన్ని కూడా వదులుకున్నాడు. ఈ క్రమంలో ఆయా చిత్ర బృందాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా తగ్గలేదు. పూర్తిగా తన దృష్టంతా ‘డీజే టిల్లు-2’ మీదే పెట్టాడు. మొత్తానికి కష్టపడి పార్ట్-2కు స్క్రిప్టు రెడీ చేశాడు. త్వరలోనే షూటింగ్‌కు వెళ్లబోతోంది సిద్ధు అండ్ టీం. ఐతే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగబోతున్న నేపథ్యంలో వాటిని అందుకోవడం సిద్ధుకు అంత తేలిక కాదు.
డీజే టిల్లు మామూలుగానే విడుదలై.. రిలీజ్ తర్వాత క్యారెక్టర్ జనాలకు బాగా ఎక్కేసి బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ఏ అంచనాలు లేకుండా ఓపెన్ మైండ్‌తో థియేటర్లకు వెళ్లి సర్ప్రైజ్ అయ్యారు ఆడియన్స్. కానీ ఈసారి చాలా అంచనాలు పెట్టుకుని, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మైంట్ ఆశిస్తూ థియేటర్లలోకి అడుగు పెడతారు. వాళ్లను సంతృప్తిపరచడం ఈజీ కాదు. సిద్ధు అండ్ కోకు ఇది చాలా పెద్ద టాస్కే. రెండు సినిమాలు వదులుకుని మరీ ఈ చిత్రానికే అంకితమైన సిద్ధు.. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉండే ఉంటాడు. మరి ఈ స్థితిలో అతనెలాంటి సినిమాను డెలివర్ చేస్తాడో చూడాలి.