మంచు విష్ణు-ప్రకాష్ రాజ్.. మళ్లీ ఇన్నాళ్లకు

గత ఏడాది ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సందర్భంగా జరిగిన మాటల యుద్ధం, ఆరోపణలు ప్రత్యారోపణలు, వాదోపవాదాల గురించి తెలిసిందే. ‘మా’ ఎన్నికల సందర్బంగా గతంలోనూ రభస జరిగింది కానీ.. ఈసారి జరిగిన గొడవ మాత్రం నభూతో అనే చెప్పాలి.

మరీ కింది స్థాయికి వెళ్లిపోయి ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, విమర్శలు చూసేవారికి చికాకు పుట్టించాయి. అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య వ్యక్తిగత స్థాయిలోనే విభేదాలు తలెత్తే పరిస్థితి వచ్చింది.

ఎన్నికల తర్వాత కూడా గొడవ కొనసాగి ప్రకాష్ రాజ్ ‘మా’లో తన సభ్యత్వానికి రాజీనామా చేయడం.. అతడి ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లంతా కూడా పదవులు వదులుకోవడం తెలిసిందే. తర్వాత ఏ సందర్భంలోనూ విష్ణు, ప్రకాష్ రాజ్ ఎక్కడా కలవలేదు. కాగా ఇప్పుడు అర్జున్ దర్శకత్వంలో విశ్వక్సేన్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ఈ ఇద్దరూ హాజరై కాసేపు ముచ్చటించుకోవడం విశేషం.

ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. ప్రారంభోత్సవ వేడుకకు పవన్ కళ్యాణ్, రాఘవేంద్రరావు తదితరులతో పాటు విష్ణు కూడా అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరికొకరు ఎదురుపడి కాసేపు మాట్లాడుకున్నారు. వీరితో పవన్ కళ్యాణ్ కూడా జత కలిశాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు పవన్ పరోక్షంగా మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

కాగా గతంలో పవన్ మీద ప్రకాష్ రాజ్ రాజకీయ పరమైన విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఆ సంగతి పక్కన పెట్టేసి ఇద్దరూ ‘వకీల్ సాబ్’లో కలిసి నటించారు. గురువారం ఈ ఇద్దరూ కూడా ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కాగా సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశ్వక్ మీద పవన్ క్లాప్ ఇవ్వగా.. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా మైక్ అందుకున్న ఆయన.. పవన్‌ను ఉద్దేశించి ‘‘నిన్ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది నాకు’’ అనడంతో ఆ ప్రాంగణమంతా హోరెత్తింది. పవన్ కూడా నవ్వేశాడు.