న‌వ్వించి ఏడిపించేసిన అక్ష‌య్

బాలీవుడ్ ఇప్పుడు కొత్త సినిమాల విష‌యంలో గుండెలు అర‌చేతుల్లో పెట్టుకుని ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. సామ్రాట్ పృథ్వీరాజ్ లాంటి భారీ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ ప‌రాజ‌యం చ‌విచూడ‌టం, గ‌త కొన్ని నెల‌ల్లో వ‌చ్చిన మ‌రికొన్ని మంచి సినిమాలు ప్రేక్ష‌కుల తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డంతో మున్ముందు రాబోయే పెద్ద సినిమాల విష‌యంలో చాలా టెన్షన్ ప‌డుతున్నారు అక్క‌డి నిర్మాత‌లు.

రాబోయే రెండు నెలల్లో చాలా వ‌ర‌కు చిన్న మీడియం చిత్రాలే విడుద‌ల కానుండ‌గా.. త‌ర్వాత ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు మాత్రం రెండు భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. అందులో ఒక‌టి ఆమిర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చ‌ద్దా కాగా.. మ‌రొక‌టి అక్ష‌య్ కుమార్ సినిమా ర‌క్షాబంధ‌న్. ఇప్ప‌టికే లాల్ సింగ్ చ‌ద్దా ట్రైల‌ర్ రిలీజ‌వ‌గా.. రెస్పాన్స్ ఏమంత గొప్ప‌గా లేదు. ఇక ర‌క్షాబంధ‌న్ ట్రైల‌ర్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు అది కూడా రిలీజైపోయింది.

ఎక్కువ‌గా యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్లు చేసే అక్ష‌య్.. ఈసారి ఎంట‌ర్టైన్మెంట్ ప్ల‌స్ సెంటిమెంటుతో బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్నాడు. న‌లుగురు చెల్లెళ్ల‌కు పెళ్లి చేయ‌డం కోసం ఓ అన్న ప‌డే తంటాల నేప‌థ్యంలో న‌డిచే సినిమా ఇది. అలాగ‌ని ఇదేమీ హిట్ల‌ర్ త‌ర‌హాలో సీరియ‌స్ సినిమా కాదు. సినిమా చాలా వ‌ర‌కు వినోదాత్మ‌కంగానే సాగేలా ఉందీ సినిమా.

ఓవైపు పెళ్లి కోసం తొంద‌ర‌పెట్టే ప్రియురాలు, ఆమె తండ్రి.. ఇంకోవైపు చెల్లెళ్ల పెళ్లి అయితే త‌ప్ప తాను పెళ్లి చేసుకోన‌ని భీష్మించుకు కూర్చున్న హీరో.. ఈ కాన్ఫ్లిక్ట్ చాలా స‌ర‌దాగా క‌నిపించింది ట్రైల‌ర్లో. పానీ పూరీ షాపు న‌డిపే హీరో ఆ మాత్రం సంపాద‌న‌తో చెల్లెళ్ల పెళ్లి ఎలా చేయ‌డానికి ప‌డే క‌ష్టాల నేప‌థ్యంలో కొంత సెంటిమెంట్ కూడా జోడించారు.

ఆడ‌పిల్ల‌ల వివాహాల‌కు చిన్న, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ఎంత ఇబ్బంది ప‌డ‌తాయో కొన్ని డైలాగుల‌తో హృద్యంగా చూపించారు. చివ‌ర్లో త‌న పెళ్లికి డ‌బ్బులెలా వ‌చ్చాయ‌ని పెద్ద చెల్లెలు అడిగితే షాపు అమ్మేశాన‌ని అక్ష‌య్ చెప్ప‌డం, మ‌రి మిగ‌తా చెల్లెళ్ల పెళ్లి ఎలా అంటే రెండు కిడ్నీలు, నా బాడీ ఉంది క‌దా అన‌డం.. హార్ట్ ట‌చింగ్‌గా అనిపించేదే.

మొత్తంగా చూస్తే కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా బాగానే ద‌ట్టించిన‌ట్లున్నారు సినిమాలో. ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు క‌నిక ధిల్లాన్ ర‌చ‌న చేయ‌డం విశేషం.