ఆర్జీవీ ‘పవర్ స్టార్’ సినిమా.. పూనమ్ కౌర్ ఎటాక్

poonam kaur

రామ్ గోపాల్ వర్మ ఈ ఉదయం ‘పవర్ స్టార్’ పేరుతో తన కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇంతకుముందు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతో ఓ చీప్ సినిమా తీసి పవన్‌ను కించపరిచే ప్రయత్నం చేశాడు వర్మ. అది చాలదన్నట్లు ఇప్పుడు పవన్‌ను అభిమానులు పిలుచుకునే ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా అంటున్నాడు.

ఇప్పటికే పవన్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తిని పట్టుకుని పవన్ లాగే డ్రెస్ వేయించి సంబంధిత వీడియోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పవన్‌ను అదే పనిగా టార్గెట్ చేయడం వర్మకు ఇది కొత్త కాదు. ఇప్పుడు ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా అనౌన్స్ చేసిన నేపథ్యంలో పవన్ మద్దతుదారుల్లో ఎవరైనా ఆయన్ని కౌంటర్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా హీరోయిన్ పూనమ్ కౌర్ రంగంలోకి దిగింది. ఆమె పేరు తరచుగా పవన్‌తో ముడిపడుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఐతే ఎప్పుడూ పవన్ పేరెత్తకుండా ట్వీట్లు వేసే పూనమ్.. కొన్నిసార్లు పవన్‌ను టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐతే ఈసారి కూడా పవన్ పేరు ఎత్తకుండానే.. పవన్‌ను టార్గెట్ చేసిన వర్మను ఆమె టార్గెట్ చేసుకుంది. వర్మ చెబుతున్న సినిమాలో ‘ఆర్జీవీ’ పేరుతో ఓ క్యారెక్టర్ పెట్టాలని.. అమ్మాయిల బలహీనతను ఉపయోగించుకుని వేరే వాళ్లను బూతులు తిట్టించడం, కొన్ని ట్వీట్లు ఫార్వార్డ్ చేసి వాటిని పోస్ట్ చేయాలని చెప్పడం.. దాని గురించి ముందే మీడియాకు లీకులివ్వడం లాంటి చేసే వ్యక్తిగా ఆ పాత్ర ఉండాలని అంటూ వర్మ బాగోతాలన్నీ బయటపెట్టే ప్రయత్నం చేసింది పూనమ్. తాను చిన్న అమ్మాయిగా ఉన్నపుడు వర్మను గౌరవించానని.. కానీ ఇప్పుడు ఆయన్ని చూసి జాలేస్తోందని పూనమ్ అంది.

ఇంతటితో ఆగకుండా ఓ ప్రముఖుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని తనకు ఫోన్ చేసి గంట సేపు బ్రెయిన్ వాష్ చేశాడంటూ వర్మ పేరెత్తకుండా ఆయనపై ఆరోపణలు గుప్పించింది పూనమ్. తనకు ఆయన పంపిన ట్వీట్లను సదరు పార్టీ వ్యక్తి ఒకరికి పంపినట్లు వెల్లడించిన పూనమ్.. మీడియాలో కొందరు నిజమైన మిత్రులండటం వల్ల తనను ప్రేరేపించిన వ్యక్తి అసలు ఉద్దేశాలేంటో తనకు అర్థమయ్యాయని పూనమ్ చెప్పింది. బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి వెనుక కారణాలేంటో ఈ వ్యక్తి తెలుసుకుని ఇండస్ట్రీ జనాలకు చెబుతాడని ఆశిస్తున్నానని.. కానీ ఇలాంటివి డబ్బులు తెచ్చిపెట్టవు కాబట్టి అతను ఆ పని చేయడని పూనమ్ పేర్కొనడం గమనార్హం.