నాగ్‌ సినిమాకు ఇద్దరు దర్శకులు?

Dhanush

అక్కినేని నాగార్జునతో పాటు అరవింద్ స్వామి, ఎస్జే సూర్య, శరత్ కుమార్, అను ఇమ్మాన్యుయెల్ ప్రధాన పాత్రలో గత ఏడాది తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’ పేరుతో ఓ సినిమా మొదలై ఆగిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.

కొన్నాళ్లు షూటింగ్ జరిపాక బడ్జెట్, ఇంకేవో సమస్యలతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు వేసుకోగా.. నిర్మాణ సంస్థ థెండ్రాల్ ఫిలిమ్స్ ఆర్థిక సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్లే సినిమా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి.

కానీ ధనుష్ ఆ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఆ స్క్రిప్టు మీద పని చేసి.. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. వేరే నిర్మాతల్ని ఒప్పించి సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేసినట్లు ఈ మధ్యే వార్తలొచ్చాయి.

ఐతే ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద మార్పు చోటు చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. ‘నాన్ రుద్రన్’ చిత్రానికి ధనుష్‌తో పాటు అతడి అన్న సెల్వ రాఘవన్ కూడా దర్శకత్వం వహించనున్నాడట. 600 ఏళ్ల కిందటి నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘యుగానికి ఒక్కడు’ తరహాలో కొన్ని ఎపిసోడ్లు ఉంటాయట. వాటిని తాను డీల్ చేయలేనని, సెల్వ అయితే బాగుంటుందని అన్నను అడగ్గా.. అతను అంగీకరించినట్లు సమాచారం.

ఒక సినిమాకు మధ్యలో దర్శకుడు మారడం మామూలే కానీ.. ఇలా అప్పటికే సినిమా తీస్తున్న దర్శకుడి అంగీకారంతో మరో దర్శకుడు ఎంటరవడం మాత్రం ఇదే తొలిసారి కావచ్చు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు కలిసి సినిమాను డైరెక్ట్ చేయడం కూడా అరుదైన విషయమే. విశేషం ఏంటంటే నాగ్ చేయాల్సిన పాత్రకు ముందు రజనీకాంత్‌ను అనుకున్నాడు ధనుష్.

ఆయన ఈ సినిమా చేసే అవకాశం లేకపోవడంతో నాగ్ వైపు చూశాడు. ధనుష్ ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈసారి ధనుష్ ఓ భారీ ప్రయత్నమే చేస్తున్నాడు.