టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కరెక్ట్.. రేట్లు పెంచాలని అడిగిన మేమంతా జోకర్లం. మేం చేసింది చాలా పెద్ద తప్పు.. ఇదీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్. ఈ వీడియో పట్టుకుని వైఎస్ జగన్ మద్దతుదారులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వర్మ స్టేట్మెంట్‌ను ఒక సర్టిఫికెట్ లాగా చూపించి.. ఎలివేషన్లు ఇస్తున్నారు. కానీ వర్మ ఈ ఇష్యూలో చాలా తెలివిగా జగన్‌ను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని జనాలకు అర్థం కావట్లేదు.
అసలు ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో తలెత్తిన సమస్య ఏంటన్నది ఇక్కడ చూడాలి ముందు. వకీల్ సాబ్ రిలీజ్ టైంలో జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడం కోసమే ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుండి రేట్లు తగ్గించింది. ఆ తగ్గించడం కూడా అలా ఇలా కాదు.
ఏపీలో చిన్న సెంటర్ల పేరు చెప్పి మరీ 5, 10, 15, 20 రూపాయలకు టికెట్ల రేట్లు పెట్టడం పెద్ద సమస్య అయింది. అన్ని రకాల ధరలూ విపరీతంగా పెరిగిపోయి, థియేటర్ల మెయింటైనెన్స్ చాలా కష్టం అయిపోయిన ఈ రోజుల్లో ఏ సెంటర్ అయినా సరే.. ఇలాంటి రేట్లతో మనుగడ అసాధ్యం. ఈ నేపథ్యంలో ఏపీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కోరుకున్నది.. ఎ, బి, సి అని ఏరియాలు చూడకుండా రూ.100 కామన్ రేట్లు ఉండేలా చూడాలని. ఆ మాత్రం రేటు ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ప్రేక్షకులకు కూడా సమ్మతమే.
కానీ ఇటు తెలంగాణలో, అటు ఏపీలో అంతకుమించి చాలా ఎక్కువగా రేట్లు పెంచేయడంతో వచ్చింది సమస్య. పెద్ద సినిమాలకు రెండు చోట్లా అదనంగా రేట్లు వడ్డిస్తున్నారు. అది ఇంకా పెద్ద ఇబ్బందిగా మారింది. అంతే తప్ప మరీ ఏపీ సర్కారు మరీ అన్యాయంగా 10-20 రూపాయలకు టికెట్లు అమ్మాలనడమే విడ్డూరం. అది జనాలకు కూడా సహేతుకంగా అనిపించలేదు. ఈ విషయాన్ని కవర్ చేస్తూ వర్మ జగన్ కరెక్ట్ అంటూ ఎలివేషన్ ఇవ్వడం, దానికి జగన్ మద్దతుదారులు మద్దతు పలకడం ఆశ్చర్యం.