బయోపిక్ ల హవా నడుస్తున్న రోజులివి. వాటికి లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో స్ఫూర్తివంతమైన పలువురి జీవితాల్ని సినిమాలు తీస్తున్నారు. ఇలాంటివేళ.. కాఫీ కింగ్ గా పేరున్న ప్రముఖ వ్యాపారవేత్త అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవటం.. ఆయన డెడ్ బాడీ నదిలో బయటపడటం లాంటి సంచలన ఉదంతాలతో దేశ వ్యాప్తంగా చర్చగా మారిన వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ జీవితాన్ని రీల్ గా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు బరిలోకి దిగాయి.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్.. ప్రసేన్ జిత్ దత్తా రాసిన కాఫీ కింగ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీయనున్నారు. ఈ మూవీ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు చేతులు కలిపాయి. తాజాగా ఈ సినిమా నిర్మాణంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. టీ సిరీస్.. ఆల్మైటీ మోషన్ పిక్చర్ తో పాటు కర్మ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నాయి.
భారతదేశంలో కాఫీని ప్రజల జీవితాల్లో భాగం చేయటమే కాదు.. కాఫీకి సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టటంలో వీజీ సిద్ధార్థ కీలక భూమిక పోషించారు. కాఫీ డే పేరుతో కొత్త తరహా వ్యాపార అవకాశాల్ని చూపించిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఆయన 59 ఏళ్ల వయసులో అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవటం.. ఆయన డెడ్ బాడీ కర్ణాటకలోని ఒక నదిలో దొరకడం లాంటి నాటకీయ పరిణామాలెన్నో. అయితే.. ఈ మూవీలో సిద్ధార్థ పాత్రను ఎవరు పోషించనున్నారన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఏమైనా.. కాఫీ కింగ్ లైఫ్ మూవీగా ఆసక్తికరంగా మారుతుందని చెప్పక తప్పదు.