రేపు విడుదల కాబోతున్న విరాట పర్వం కోసం ఎంత ప్రమోషన్ చేయాలో అంతకన్నా ఎక్కువే టీమ్ కష్టపడింది. ముఖ్యంగా సాయిపల్లవి హైదరాబాద్ లోనే మకాం పెట్టేసి అడిగిన ప్రతిఒక్కరికి ఇంటర్వ్యూలు ఇస్తూ, ఈవెంట్లన్నీ హాజరవుతూ ఎడతెరిపి లేకుండా వీటిలో పాల్గొంటూనే ఉంది. నిన్న జరిగిన ఈవెంట్ కి వెంకటేష్ అతిథిగా రావడం, వేడుక సక్సెస్ కావడం ఇవన్నీ శుభశకునాలే.
కొత్త జెనరేషన్ కు అంతగా అవగాహన లేని ఇలాంటి నక్సల్ బ్యాక్ డ్రాప్ సీరియస్ డ్రామాలకు ఈ స్థాయిలో పబ్లిసిటీ చేయడం చాలా అవసరం. ప్రస్తుతానికి బుకింగ్స్ అయితే మరీ జోరుగా లేవు కానీ యూనిట్ మాత్రం టాక్ మీద కాన్ఫిడెంట్ గా ఉంది. రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు కాకపోయినా బ్రేక్ ఈవెన్ దాటేసి మంచి ప్రయత్నం చేశారని మెచ్చుకోలు వస్తే చాలనే దిశగా దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాయిపల్లవికి నేషనల్ అవార్డు వస్తుందనే కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళలో కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి గోవధ హత్యల గురించి చేసిన కామెంట్లు ఎంత రచ్చ చేస్తున్నాయో చూస్తున్నాం.
సోషల్ మీడియాలో తనకు నిరసనగా కొన్ని గళాలు మద్దతుగా కొందరు ఇలా విడిపోయి మరీ ఆర్గుమెంట్లు చేసుకుంటున్నారు. సాయిపల్లవి ఉద్దేశం ఏదైనా అది బయటికి మాత్రం చిలవలు పలవలుగా వెళ్లిపోయింది. రేపు సినిమా నిజంగా బాగున్నా దానికెలాంటి ప్రచారం జరుగుతుందోనన్న టెన్షన్ ఆమె అభిమానులతో పాటు దగ్గుబాటి ఫ్యాన్స్ కి సైతం కలుగుతోంది. గాడ్సే తప్ప పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగుతున్న విరాటపర్వం లాంటి ప్రయత్నాలకు సపోర్ట్ దక్కడం చాలా అవసరం. చూడాలి మరి ఏం జరగనుందో