నాని.. అవి చేస్తే అలా, ఇవి చేస్తే ఇలా

నేచురల్ స్టార్ నాని ఒక టైంలో మామూలు ఫాంలో లేడు. ‘భలే భలే మగాడివోయ్’తో మొదలుపెట్టి వరుసగా హిట్లు ఇస్తూ పోయాడు. ఆ ఊపులో ‘ఎంసీఏ’ అనే మామూలు సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయింది. ఆ సినిమాను నిజానికి విమర్శకులు చీల్చి చెండాడారు. నాని ఇలాంటి రొటీన్ మాస్ మసాలా సినిమా చేశాడేంటని విమర్శించారు. కానీ ఆ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచాయి. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.

ఆ తర్వాత నాని కెరీర్ ఎత్తు పల్లాలతో సాగింది. అయినప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తాడన్న పేరును నిలబెట్టుకుంటూనే సాగాడు. కానీ రెండేళ్ల కిందట కరోనా టైంలో నాని నుంచి వచ్చిన ‘వి’ మూవీ అతడి అభిమానులతో పాటు అందరినీ నిరాశకు గురి చేసింది. ఇంత రొటీన్ మూవీ నాని ఎలా చేశాడబ్బా అనే చర్చ నడిచింది. ఆ తర్వాత ఇంకో ఏడాదికి వచ్చిన ‘టక్ జగదీష్’ సైతం అంతే. అది కూడా సగటు మసాలా మూవీనే.

రెండూ ఓటీటీలో రావడం వల్ల నాని సేఫ్ అయిపోయాడు కానీ.. అవి థియేటర్లలో వచ్చి ఉంటే మాత్రం డ్యామేజ్ మామూలుగా ఉండేది కాదు. నానికి ఈ సినిమా ఫీడ్ బ్యాక్ చేరింది కాబట్టే మళ్లీ అలాంటి సినిమాలు చేయకుండా శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికీ లాంటి తన బ్రాండ్ సినిమాలు లైన్లో పెట్టాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే.. కొవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన తీరును అందుకోవడం సవాలుగా మారిపోయింది. కొత్త తరహా సినిమాలను ఆదరిస్తారన్న గ్యారెంటీ ఇప్పుడు కనిపించడం లేదు.

‘శ్యామ్ సింగ రాయ్’ బాక్సాఫీస్ హిట్టే అయినప్పటికీ.. అతి కష్టం మీదే అది బ్రేక్ ఈవెన్ అయింది. అందులో విషయం ప్రకారం చూస్తే ఇంకా పెద్ద హిట్టవ్వాల్సిన సినిమానే. కానీ ఓ మోస్తరు సక్సెస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నాని. ఇప్పుడేమో ‘అంటే సుందరానికీ’ డీసెంట్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఫ్లాప్ అయ్యేలాగే కనిపిస్తోంది. కంటెంట్ ప్రకారం చూస్తే సినిమాకు ఇలాంటి ఫలితం రావాల్సింది కాదు. నాని రొటీన్ సినిమాలు చేశాడని విమర్శించిన వాళ్లే.. ఇప్పుడు భిన్నమైన ప్రయత్నాలు చేస్తే ఆదరించడం లేదు. ఇది నానీని కచ్చితంగా అయోమయంలో పడేసే పరిణామమే.