ఇప్పుడు కరోనా మహమ్మారిని అందరూ లైట్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కేసులు కూడా చాలా తక్కువగానే నమోదవుతూ ఉండొచ్చు. కానీ కరోనా ప్రభావం మాత్రం జనాల మీద ఎప్పటికీ కొనసాగేలా ఉంది. కొవిడ్ వల్ల మనుషుల దైనందిన జీవితాల్లో, అలాగే వారి ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చేసింది. సినిమాల విషయానికి వస్తే.. కొత్త సినిమా వస్తే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే అన్న మైండ్ సెట్ ఇప్పుడు జనాల్లో లేదు.
థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటును కొవిడ్ బ్రేక్ చేసింది. అదే సమయంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీనికి తోడు కరోనా నష్టాల్ని భర్తీ చేసుకోవడం కోసమని నిర్మాతలు టికెట్ల ధరలను మరీ ఎక్కువ పెంచేయడం, పెద్ద సినిమాలకు అదనంగా వడ్డించడం లాంటి పరిణామాలు ప్రేక్షకులను మరింతగా థియేటర్లకు దూరం చేసేశాయి.
ఇప్పుడు మా సినిమాలకు రేట్లు తగ్గించాం, సాధారణ రేట్లకే సినిమా చూపిస్తాం అని స్టేట్మెంట్లు ఇవ్వడం, ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం లాంటివి నిర్మాతలు చేస్తున్నారంటే టికెట్ల ధరలు ఏ స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య మేజర్, విక్రమ్ సినిమాలకు రీజనబుల్ రేట్లు పెట్టడం బాగానే కలిసొచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 195-200 రేట్లు పెట్టారు ఈ సినిమాలకు.
కానీ తర్వాత వచ్చిన నాని సినిమా అంటే సుందరానికీ విషయంలో నిర్మాతలు ఈ బాటలో వెళ్లలేదు. ఆ చిత్రానికి సింగిల్ స్క్రీన్లలో 175, మల్టీప్లెక్సుల్లో 250 రేట్లు పెట్టారు. దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు అదనం. ఇది ప్రేక్షకులకు రుచించినట్లు లేదు. ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడానికి రేట్లు ఎక్కువ ఉండడం కూడా ఒక కారణమైందన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో ఈ వారం రానున్న రానా సినిమా విరాటపర్వంకి నిర్మాతలు ఆలోచించిన నిర్ణయం తీసుకున్నారు. 150, 200 రేట్లతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సత్యదేవ్ మూవీ గాడ్సెకు కూడా ఇవే రేట్లు ఉండబోతున్నాయి. గాడ్సె సంగతేమో కానీ.. విరాటపర్వంకి ఈ రేట్లు మేలు చేయొచ్చు.