ఖైదీ + రోలెక్స్ – డెడ్లీ కాంబో

విక్రమ్ ఇచ్చిన సక్సెస్ కిక్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు మాములుగా లేదు. కమల్ హాసన్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వడమే కాక కేవలం మూడు నిమిషాల సూర్య పాత్రతో ఏకంగా థియేటర్ స్క్రీన్లనే తగలబెట్టించే రేంజ్ లో హీరోయిజం పండించడం అతనికే చెల్లింది. అరవ తంబీలు ఒక అడుగు ముందుకేసి తెలుగులో రాజమౌళి కన్నడలో ప్రశాంత్ నీల్ ఎలాగో కోలీవుడ్ కు లోకేష్ అలా అంటూ అతిశయోక్తితో కూడిన పొగడ్తలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. రెండు వందల కోట్ల గ్రాస్ ని అవలీలగా టార్గెట్ చేయడం వల్లే ఇదంతా.

ఇక్కడితో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ని లోకేష్ ఆపేయడం లేదు.ఇంకో లెవెల్ కు తీసుకెళ్తున్నాడు. విక్రమ్ క్లైమాక్స్ కు ముందు కార్తీ ఖైదీలో పోషించిన ఢిల్లీ క్యారెక్టర్ ని కేవలం వాయిస్ ఓవర్ లో మాత్రమే వినిపించాడు. దానికో బలమైన కారణం ఉందని అదేంటో రోలెక్స్, ఢిల్లీలు ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు తెలుస్తుందని ఓ ఇంటర్వ్యూలో లీక్ ఇచ్చేశాడు. అంటే నెక్స్ట్ పార్ట్ లో అన్నదమ్ముల అదిరిపోయే కాంబినేషన్ ఉంటుందన్న మాట. ఇదెప్పటి నుంచో ఎదురుచూస్తున్న కలయిక కావడంతో రికార్డులు బద్దలు కావడం ఖాయం.

కాకపోతే ఈ ఉద్వేగాన్ని అభిమానులు ఇంకొంత కాలం భరించాలి. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ ఇంకో మూడు నాలుగు నెలల్లో విజయ్ తో సినిమా మొదలుపెట్టాల్సి ఉంటుంది. వంశీ పైడిపల్లితో ప్రస్తుతం చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ అవ్వగానే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఈలోగా విక్రమ్ అండ్ ఖైదీ సీక్వెల్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ఫైనల్ చేసేయొచ్చు. ట్విస్ట్ ఏంటంటే లోకేష్ ఆల్రెడీ ఇదంతా పూర్తి చేసి ఉంచాడు.ఒకవేళ విక్రమ్ ఫ్లాప్ అయ్యుంటే వదిలేసేవాడు. కానీ ఇప్పుడా భయం అక్కర్లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ విక్రమ్ రోలెక్స్ ఢిల్లీలు ముగ్గురు కలిసి దర్శనమిస్తే అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోడం కష్టమే.