జోకర్.. జోకర్.. జోకర్.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు విస్తృతంగా కనిపిస్తోంది. ఇది గత ఏడాది విడుదలైన హాలీవుడ్ మూవీ పేరు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.8 వేల కోట్లు) కొల్లగొట్టిన సినిమా ఇది. ఇండియాలో కూడా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిందీ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధించి.. పెద్ద చర్చకు దారి తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఆన్ లైన్లోకి వచ్చింది.
అమేజాన్ ప్రైంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సినిమా రిలీజైంది. ఈ క్షణాల కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి మెస్మరైజ్ అయిన వాళ్లు.. అలాగే థియేటర్లలో చూడలేకపోయామే అనుకున్న వాళ్లు అమేజాన్ ప్రైమ్ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రైమ్‌లో ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కాబోతోందని వారం కిందట సమాచారం బయటికి వచ్చింది. అప్పట్నుంచి సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ నడుస్తోంది. 20న ప్రైమ్‌లో జోకర్ రిలీజ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. థియేటర్లలో సినిమా రిలీజవుతున్న తరహాలో ప్రైమ్ రిలీజ్‌కు హంగామా కనిపిస్తుండటం విశేషం. ఈ హంగామా చూసి ఏముందీ సినిమాలో అంటూ ఇంతకుముందు దీన్ని పట్టించుకోని వాళ్లు కూడా ఒక లుక్ వేయడానికి రెడీ అవుతున్నారు.
ప్రైమ్‌లో సినిమా పెట్టడం ఆలస్యం.. కోట్లమంది అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలుపెట్టేసి ఉంటారనడంలో సందేహం లేదు. దీనికి ప్రైమ్‌లో రికార్డు స్థాయి వ్యూస్ వస్తాయని భావిస్తున్నారు. టాడ్ ఫిలిప్స్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రంలో జాక్విన్ ఫోనిక్స్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో అద్భుత నటనకు గాను అతను ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మరెన్నో పురస్కారాలు దక్కాయి.