యువ దర్శకుడి మెగా వాడకం

ఇప్పటి జెనరేషన్ కు స్టార్ హీరోలు బోలెడున్నారు కానీ వీళ్లకు ప్రత్యేకంగా నెంబర్ వన్ అంటూ ర్యాంకింగ్ ఏముండదు. కానీ మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిన్నటి తరానికి మాత్రం అగ్ర సింహాసనం ఒక్క చిరంజీవికి మాత్రమే సొంతం. అంతటి అభిమానం సంపాదించుకున్నారు కాబట్టే ఆయన కుటుంబం నుంచి ఎందరు హీరోలు వచ్చినా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇప్పుడేదో ఆచార్య ఫలితం చూసి మెగాస్టార్ ఛరిష్మా తగ్గిందని కొందరు అనుకోవచ్చేమో కానీ యువ దర్శకులు మాత్రం నో అనేస్తున్నారు.

నిన్న విడుదలైన అంటే సుందరంలో నాని చిన్నప్పటి ఎపిసోడ్ లో శేఖర్ మాస్టర్ అబ్బాయి నిమ్మి ఆ పాత్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ అబ్బాయిని చిరంజీవి వీరాభిమానిగా చూపించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. సుమారు పది నిమిషాలకు పైగానే వివిధ పాత్రల ద్వారా చిరు నామజపం వినిపిస్తూనే ఉంటుంది. 1999లో జరిగిన కథగా చూపించే క్రమంలో చిరంజీవిని అప్పటి జనం ఏ స్థాయిలో ఇష్టపడేవారో బాగా చూపించారు. లెన్త్ పరంగా ఇది కొంచెం ల్యాగ్ అనిపించినా మెగా ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడే కాదు చిరంజీవి రెఫరెన్సులు చాలా ఏళ్ళుగా దర్శకులు వాడుతూనే ఉన్నారు. అయితే ముప్పై వయసులోపే ఉన్న డైరెక్టర్లకు సైతం మెగాస్టార్ తాలూకు ప్రభావం ఇంత బలంగా ఉండటం ఆశ్చర్యమే. ఆ మధ్య ఆచార్య ప్రమోషన్ లో భాగంగా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న డైరెక్టర్లు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసి అందులో తమ ప్రేమను భక్తిని గట్టిగానే ప్రదర్శించారు. తాము ఆ సినిమాల్లో లేకపోయినా కేవలం తమ పేరుని వాడుకోవడం ద్వారా ఈలలేయించుకోవడం స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత చిరుకే చెల్లింది