మల్టీస్టారర్ చకచకా పూర్తి

2017లో వచ్చిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదా ఎప్పటికీ చెప్పుకునే కల్ట్ క్లాసిక్. తమిళనాడులో బాహుబలి రికార్డులకే ఎసరు పెట్టిందంటే ఇది ఏ స్థాయి హిట్టో చెప్పనక్కర్లేదు. విజయ్ సేతుపతికి అంతులేని స్టార్ డం వచ్చింది దీని వల్లే. మాధవన్ సెకండ్ ఇన్నింగ్స్, జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ కెరీర్ కు బలంగా పునాది వేసుకోవడానికి దోహదం చేసింది కూడా ఈ మూవీనే. అప్పటిదాకా పెద్దగా గుర్తింపు లేని దర్శక దంపతులు పుష్కర్ గాయత్రిలు ఒక్కసారిగా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది ఇది చేసిన మేజిక్ ఫలితంగానే.

ఇంతటి చరిత్ర ఉన్న విక్రమ్ వేదాని తెలుగులో రీమేక్ చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. రవితేజ రానా వెంకటేష్ ఇలా ఏవేవో కాంబినేషన్లు అనుకుని చివరికి అటకెక్కించారు. కట్ చేస్తే బాలీవుడ్ లో హిందీ వెర్షన్ ని చకచకా పూర్తి చేసేశారు. గాయత్రి పుష్కర్ లే బాధ్యతలు తీసుకుని హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే లాంటి క్యాస్టింగ్ ని పెట్టుకుని కేవలం నెలల వ్యవధిలోనే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి గుమ్మడికాయ కొట్టేసి ఈ రోజు సోషల్ మీడియాలో ప్రకటించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటిదాకా తమిళ వెర్షన్ చూడని మన జనాలు చాలానే ఉన్నారు. ఇప్పుడీ హిందీ విక్రమ్ వేదా వచ్చేస్తే అందులో అధిక శాతం దీన్ని చూసేస్తారు. అప్పుడిక మనవాళ్ళు తీయాలన్న ఆలోచన విరమించుకోవడం మంచిదవుతుంది. చిన్నది పెద్దది అనే తేడా లేకుండా తమిళ మలయాళంలో ఏదైనా మినిమమ్ హిట్ అయితే చాలు రీమేకుల కోసం పరుగులు పెట్టే మన దర్శక నిర్మాతలు విక్రమ్ వేదా వచ్చి అయిదేళ్ళు దాటుతున్నా దాన్నలా వదిలేయడం విచిత్రమే.