మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కెరీర్లో ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్లో తిరుగులేని హవా సాగించి, రాజకీయాల కారణంగా పదేళ్లు విరామం తీసుకుని.. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో సత్తా చాటడంతో చిరుకు తిరుగులేదని అందరూ కొనియాడారు అందరూ. కానీ ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రం చేసిన చిరు.. ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయారు.
ఐతే ఆ సినిమాతో చిరు మీద మోయలేని భారం మోపడం ప్రతికూలంగా మారింది. కాబట్టి నాలుగు బ్లాక్‌బస్టర్లు కొట్టిన కొరటాల శివతో చేస్తున్న ‘ఆచార్య’తో చిరు బౌన్స్ బ్యాక్ అవుతారని, ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. చిరు కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో చిరు ఒక్కసారిగా ఒత్తిడిలో పడిపోయాడు. ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఈ ప్రభావం గట్టిగానే పడింది.
స్వయంగా అభిమానులే ఎన్నాళ్లీ మూస, మాస్ సినిమాలు చేస్తారనే ప్రశ్నలు చిరుకు సంధిస్తున్నారు. మెహర్ రమేష్‌తో చేస్తున్న ‘భోళా శంకర్’ను అందరూ వ్యతిరేకిస్తున్నారు. అసలే కెరీర్ అంతంతమాత్రంగా ఉన్న టైంలో ఈ రీమేక్‌లు, రొటీన్ మాస్ మసాలా సినిమాలు అవరామా అంటున్నారు. అసలు చిరు ఇంకా ఈ ఫార్మాట్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు.. కమర్షియల్ హంగుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు..
మోహన్ లాల్ లాగా కథ ప్రధానంగా సాగే వైవిధ్యమైన సినిమాల్లో నటించవచ్చు కదా.. తనలోని నటుడిని సంతృప్తిపరుచుకుని ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇవ్వొచ్చు కదా అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే ఈ రకమైన ఒత్తిడి ఆయన మీద ఉండగా.. తాజాగా కమల్ ‘విక్రమ్’లో ఇలాగే వైవిధ్యమైన పాత్రతో భారీ విజయాన్నందుకోవడంతో మెగాస్టార్ మీద ఇంకా ఒత్తిడి పెరిగిపోయింది. చిరుతో పాటు సీనియర్ హీరోలందరికీ ‘విక్రమ్’తో కమల్ పాఠాలు నేర్పారు. కానీ అందరికంటే ఎక్కువగా చిరు మీదే కమల్ ఎక్కువ ప్రెజర్ పెంచేశారన్నది స్పష్టం.