కొన్నేళ్ల కిందట ఎక్స్‌ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, మహానుభావుడు లాంటి చిత్రాలతో కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నట్లుగా కనిపించాడు యువ కథానాయకుడు శర్వానంద్. కానీ ఆ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక.. అతడి కెరీర్ గాడి తప్పింది. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తాయనుకున్న పడి పడి లేచె మనసు, మహాసముద్రం లాంటి సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా మిగలడంతో శర్వా మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
ఈ మధ్య ఆడవాళ్ళు మీకు జోహార్లు పర్వాలేదనే టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలవడానికి శర్వా మార్కెట్ దెబ్బ తినడమే కారణం. ఇప్పుడు అతడి కెరీర్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ఇలాంటి టైంలో కొంచెం గ్యాప్ తీసుకుని ఆచితూచి ఓ సినిమా చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. లిరిసిస్ట్ కృష్ణచైతన్య.. శర్వా కొత్త సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు ఇంతకుముందే వెల్లడైన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి కొన్ని రోజులుగా కథానాయికల వేట సాగుతోంది. రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. చివరికి రాశి ఖన్నా, ప్రియమణిలను ఖరారు చేసినట్లు సమాచారం. రాశి ఖన్నాది శర్వాకు జోడీగా కనిపించే పాత్రే కానీ.. ప్రియమణిది ఆ టైపు కాదని తెలుస్తోంది. ఆమెది ప్రత్యేక పాత్ర అంటున్నారు. రాశికి కూడా టాలీవుడ్లో ఈ మధ్య కెరీర్ ఏమంత బాగా లేదు.
కొత్త రిలీజ్‌లు పక్కా కమర్షియల్, థ్యాంక్ యు రిలీజ్ కోసం ఆమె ఎదురు చూస్తోంది. ఇలాంటి టైంలో కాస్త రిస్క్‌లా అనిపిస్తున్న ప్రాజెక్టును ఆమె ఓకే చేసింది. శర్వాతో ఆమె తొలి చిత్రం ఇదే. ఈ సినిమాలో ప్రియమణి నటించడం కూడా ఆసక్తికరమే.