విజేత మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్. ఆ సినిమా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత సూపర్ మచ్చి అనే సినిమా చేస్తే.. అది చాన్నాళ్లు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయి ఈ సంక్రాంతికి రిలీజైందంటే అయ్యింది అన్నట్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
ఐతే దీంతో పాటే కళ్యాణ్.. కిన్నెరసాని అనే ఒక వైవిధ్యమైన సినిమా చేశాడు. అశ్వథ్థామ దర్శకుడు రమణతేజ రూపొందించిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ మిత్రుడైన రామ్ తాళ్లూరి నిర్మించాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరి 25కు రిలీజ్ డేట్ ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కిన్నెరసాని వార్తల్లో లేదు. ఐతే ఇప్పుడీ చిత్రం రిలీజ్ అప్‌డేట్‌తో వార్తల్లోకి వచ్చింది. ఐతే ముందు అనుకున్నట్లు దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయట్లేదు.
కిన్నెరసాని నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది. ఈ నెల 10న ప్రిమియర్స్ పడబోతున్నాయి. మీడియం రేంజ్ సినిమాలు కూడా థియేటర్లలో సరిగా ఆడని పరిస్థితులున్నాయి ఇప్పుడు. ప్రేక్షకులు చాలా సెలక్టివ్‌గా థియేటర్లకు వస్తున్నారు. బజ్ లేని చిన్న సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు.
కిన్నెరసాని ప్రోమోలు ఆసక్తికరంగానే అనిపించినా.. కళ్యాణ్‌దేవ్‌కు ప్రేక్షకుల్లో క్రేజ్ లేకపోవడం, శ్రీజతో విభేదాలని వార్తలు వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ, అభిమానులు అతణ్ని పట్టించుకోకపోవడంతో ఈ చిత్రానికి హైప్ రాలేదు. థియేటర్లలో రిలీజ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని భావించి నేరుగా ఓటీటీ విడుదలకు సై అన్నట్లున్నారు. మలయాళ అమ్మాయి అన్ షీతల్ ఇందులో కథానాయికగా నటించింది. రవీంద్ర విజయ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇదొక థ్రిల్లర్ మూవీ.