ప్రభాస్ అభిమానులకు మండిపోతోంది

Adipurush
Adipurush

ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ విడుదలకు ఇంకా ఏడు నెలల సమయం ఉంది. 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. కానీ ఇప్పుడే ఆ సినిమా టికెట్ల ధరల గురించి చర్చ నడుస్తోంది. ‘ఆదిపురుష్’కు బ్లాక్‌బస్టర్ టికెట్ ప్రైసింగ్ ఉంటుందని నిర్మాత భూషణ్ కుమార్ ప్రకటించారు.

ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమాకూ లేని స్థాయిలో టికెట్ల ధరలు ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు. సినిమా బడ్జెట్ గురించి, బిజినెస్ గురించి, కంటెంట్ గురించి ఇలా ఘనంగా స్టేట్మెంట్స్ ఇస్తే ఓకే కానీ.. టికెట్ల ధరలు భారీగా ఉండబోతున్నాయని ఇంత ముందుగా ఇలా ప్రకటన ఇవ్వడం విడ్డూరం. ఇదేమీ ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే విషయం కాదు. ఎవ్వరూ ఈ స్టేట్మెంట్‌ను సానుకూలంగా తీసుకోవట్లేదు. ప్రభాస్ అభిమానులే దీని గురించి నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. నిర్మాత మీద మండిపడుతున్నారు.

అసలు ‘ఆదిపురుష్’ సినిమాను అనౌన్స్ చేసి రెండేళ్లు కావస్తుండగా.. ఇప్పటిదాకా దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. షూటింగ్ పూర్తయి కూడా కొన్ని నెలలు గడిచింది. పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్ చేశాక ప్రభాస్ రెండు పుట్టిన రోజులు జరుపుకున్నాడు. రెండు శ్రీరామనవమి పండుగలొచ్చాయి. కానీ ఏ సందర్భంలోనూ చిన్న విశేషాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకోలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ తీవ్ర నిరాశకు గురి చేశాయి. అవి రెండూ భారీ నష్టాలు మిగిల్చాయి. వాటి తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ ‘ఆదిపురుష్’ మీద పడింది. పైగా ఈ సినిమా రామాయణం మీద తెరకెక్కుతున్న చిత్రం కావడంతో కొత్తగా ఏం చూపిస్తారా అన్న ప్రశ్నలున్నాయి. ఎగ్జైట్మెంట్ ఏమీ కలగట్లేదు. ఏ రకమైన ప్రమోషన్లు కూడా లేకపోవడంతో ప్రస్తుతానికి హైప్ ఏమీ కనిపించడం లేదు.

ఇలాంటి టైంలో సినిమాకు బజ్ పెంచడానికి ఏమైనా చేయాల్సింది పోయి టికెట్ల రేట్లు భారీగా ఉంటాయని స్టేట్మెంట్ ఇవ్వడమేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టికెట్ల ధరలు ఎక్కువై ప్రేక్షకులు థియేటర్లకు అంతకంతకూ దూరమైపోతున్నారు. సినిమాల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇలాంటి టైంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నల్ని ప్రభాస్ అభిమానులే సంధిస్తున్నారు.