మార్మోగుతున్న ఉదయ్ కిరణ్ పేరు

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. ముఖ్యంగా 2000వ సంవత్సరం నాటి యూత్‌ అయితే ఈ పేరును ఎంతగా ఇష్టపడ్డారో చెప్పడం కష్టం. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుసగా మూడు సెన్సేషనల్ సినిమాలతో అతను ప్రేక్షకుల్లో గుండెల్లోకి దూసుకెళ్లిపోయాడు. ఈ మూడు చిత్రాలూ బడ్జెట్ మీద పది రెట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. దీన్ని బట్టి అవెంత బ్లాక్‌బస్టర్లో అర్థం చేసుకోవచ్చు. అప్పటి కుర్రాళ్లందరూ ఉదయ్‌లో తమను తాము చూసుకున్నారు.

అమ్మాయిలందరూ ఉదయ్ లాంటి వాడు తమ జీవితంలోకి రావాలని కోరుకున్నారు. పెద్దవాళ్లను కూడా అమితంగా ఆకట్టుకున్న ఉదయ్.. ఆ తర్వాతి కాలంలో ఆశించిన విజయాలందుకోలేకపోయాడు. కొన్నేళ్ల తర్వాత లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడు.

కట్ చేస్తే.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని అందరినీ విషాదంలో ముంచెత్తాడు. ఇప్పటికీ ఉదయ్ అభిమానుల్ని ఆ బాధ వెంటాడుతోంది. మొన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడితే మన వాళ్లందరికీ ఉదయ్ కిరణ్ గుర్తుకొచ్చాడు. సుశాంత్‌తో చాలా రకాలుగా ఉదయ్‌కు పోలికలుండటమే అందుక్కారణం.

ఉదయ్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతుండగానే గురువారం అతడి పుట్టిన రోజు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ పేరు మార్మోగుతోంది. హైదరాబాద్‌లోనే కాదు.. ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది ఉదయ్ పేరు. అతడి సినిమాలు.. పాత్రల్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు ఉద్వేగానికి గురవుతున్నారు.

ఉదయ్ కెరీర్ ఆరంభంలో ఒక్కో సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్లతో ఉదయ్ ఫొటోలను కూడా పంచుకుంటున్నారు. ఇదంతా చూస్తే ఉదయ్ మీద ఇప్పటికీ జనాలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.