రెండు దశాబ్దాల కెరీర్లో అపజయమే ఎరుగని దర్శకుడు రాజమౌళి. ఐతే కేవలం ప్రతి సినిమానూ సక్సెస్ చేయడం వల్ల మాత్రమే అతను గొప్ప దర్శకుడు అయిపోలేదు. కెరీర్లో ఒక దశ వరకు మామూలు కమర్షియల్ సినిమాలే తీసిన ఆయన.. మగధీర నుంచి ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు. భారతీయ దర్శకుల ఊహకు కూడా అందని భారీ కథలతో వెండితెరపై అద్భుతాలు చేశాడు. బాహుబలితో ఆయన కీర్తి, అలాగే భారతీయ సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయాయి.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాడు జక్కన్న. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో, హాలీవుడ్ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు జక్కన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ఓ ఆసక్తికర ప్రశ్నకు జక్కన్న ఇచ్చిన సమాధానం ఆయన ఇండియన్ ఫ్యాన్స్‌ను బాగా ఎగ్జైట్ చేస్తోంది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టిన నేపథ్యంలో హాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా, మార్వెల్ తరహా సినిమాలు చేస్తారా అని జక్కన్నను అడిగితే.. సున్నితంగా నో చెప్పేశాడు. తాను భారతీయ పురాణాలు, ఇక్కడ సంస్కృతి మీద అవగాహన పెంచుకుని.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీస్తూ వచ్చానని.. అదే తనకు ఎక్కువ ఆనందాన్నిచ్చే విషయమని రాజమౌళి అన్నాడు.
మార్వెల్ తరహా సినిమాలపై తనకు పట్టు లేదని, తన ఆలోచనలకు అవి తగవని చెప్పాడు. తాను మార్వెల్ సినిమాలను ఒక ప్రేక్షకుడిగా బాగానే అస్వాదిస్తానని.. కానీ అలాంటి సినిమాలు తాను తీయలేనని జక్కన్న తేల్చేశాడు. ఇక ముందు కూడా భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే, ఇక్కడి ఇతివృత్తాలతోనే సినిమాలు తీస్తానని.. వీలైతే మన కథలనే మార్వెల్ తరహాలో, అంతకుమించి తీసే ప్రయత్నం చేస్తానని రాజమౌళి చెప్పడం విశేషం. ఈ సమాధానం రాజమౌళి అభిమానులనే కాక.. భారతీయ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. జక్కన్నపై ప్రశంసలు కురిసేలా చేస్తోంది.