బాలీవుడ్‌కు టాలీవుడ్ మరో షాకివ్వబోతోందా?

సౌత్ సినిమాల దెబ్బ‌కు బాలీవుడ్ ఇప్ప‌టికే కుదేలై ఉంది. పుష్ప‌, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాల ధాటికి హిందీ చిత్రాలు అస్స‌లు నిల‌వలేక‌పోయాయి. అక్క‌డి టాప్ స్టార్లు న‌టించిన సినిమాలు వీటి ధాటికి కుదేల‌య్యాయి. ఐతే ఇటీవ‌ల కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన భూల్ భూల‌యియా-2 మంచి వ‌సూళ్లు రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ రేంజికి వెళ్ల‌డంతో బాలీవుడ్లో ఆశ‌లు రేకెత్తాయి.

ఈ నేప‌థ్యంలో జూన్ 3న విడుద‌ల కానున్న అక్ష‌య్ కుమార్ సినిమా పృథ్వీరాజ్ సైతం బాక్సాఫీస్‌కు మంచి ఊపు తెస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు అక్క‌డి ట్రేడ్ పండిట్లు. కానీ అదే రోజు రిలీజ‌య్యే రెండు సౌత్ సినిమాల ధాటికి పృథ్వీరాజ్ నిల‌వ‌గ‌ల‌దా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మేజ‌ర్ సినిమా నుంచి అక్ష‌య్ సినిమాకు ముప్పు త‌ప్పేలా లేదు.

ముంబ‌యి తాజ్ హోటల్లో ఉగ్ర‌వాదుల‌తో వీరోచితంగా పోరాడి మ‌ర‌ణించిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన మేజ‌ర్ దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేదే. ట్రైల‌ర్‌తో ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో రావాల్సిన క్రేజ్ వ‌చ్చేసింది. పైగా రిలీజ్‌కు ప‌ది రోజుల ముందే దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్రిమియర్స్‌తో అదిరిపోయే ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ అమ‌లు చేశారు. ప్రతి ప్రివ్యూ షోకూ మంచి టాక్ వ‌స్తోంది. సినిమా కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో సూప‌ర్ స‌క్సెస్ అయ్యేలా ఉంది.

అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జ‌రుగుతున్నాయి. మరోవైపు క‌మ‌ల్ సినిమా విక్ర‌మ్‌కు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజే క‌నిపిస్తోంది. వీటితో పోటీ ప‌డి పృథ్వీరాజ్ నిలిచే ప‌రిస్థితి లేదు. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బేన‌ర్లో భారీ బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి రిలీజ్ ముంగిట హైప్ క‌నిపించ‌డం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఊపు లేదు. దీంతో మ‌రోసారి టాలీవుడ్ దెబ్బ‌ను బాలీవుడ్ రుచిచూడ‌బోతుందేమో అన్న డౌట్లు కొడుతున్నాయి.