అడిగి మరీ తగ్గిస్తున్న మేజర్

ఈ వారం విడుదల కాబోతున్న మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువ హైప్ ఉన్నది మేజర్ కే. ప్రమోషన్ విషయంలో టీమ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తోంది. 9 రోజుల ముందే డేర్ చేసి హైదరాబాద్ మినహా దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీ రిలీజ్ ప్రీమియర్లు వేయడం వాటికొచ్చిన స్పందనను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కలిసొచ్చింది. టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సైతం సానుకూల ఫలితాలను ఇస్తోంది. ఇది సవ్యంగా జరిగేందుకు అడవి శేష్ స్వయంగా రంగంలోకి దిగాడు.

కొద్దిరోజుల క్రితం మేజర్ టికెట్ రేట్లను తెలంగాణ సింగల్ స్క్రీన్లలో 150 రూపాయలకు ఇస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టిసి క్రాస్ రోడ్స్ మెయిన్ థియేటర్ సంధ్యలో అడ్వాన్స్ బుకింగ్ 175 చూపించడంతో ఒక అభిమాని శేష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో స్పందించిన శేష్ తాను యాజమాన్యంతో మాట్లాడి రిక్వెస్ట్ చేశానని అది తిరిగి 150 అవుతుందని హామీ ఇచ్చాడు. వాస్తవానికి ఇదంతా హీరో చేయాల్సిన పని కాదు. నిర్మాత డ్యూటీ. కానీ అలాంటి భేషజాలకు పోకపోవడం విశేషం.

మొన్నామధ్య ఎఫ్3కి కూడా దిల్ రాజు ఇలాంటి హామీనే ఇచ్చినప్పటికి నైజామ్ మల్టీప్లెక్సుల్లో ఎక్కడా 250 రూపాయల టికెట్ రేట్ కనిపించలేదు. కానీ మేజర్ ఈ ఇష్యూ లో చాలా అలెర్ట్ గా ఉండటం మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. మొత్తానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్న మేజర్ కనక అంచనాలు అందుకునే కమర్షియల్ సక్సెస్ కష్టమేమీ కాదు. పోటీగా ఉన్న విక్రమ్, సామ్రాట్ పృథ్విరాజ్ లతో పోలిస్తే కంటెంట్ అండ్ జానర్ పరంగా మేజర్ కున్న అడ్వాంటేజ్ ఎక్కువ. ఎలా వాడుకుంటారో చూడాలి.