రానా దగ్గుబాటి ప్రధాన పాత్ర పోషించిన విరాటపర్వం సినిమా విడుదల ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భీమ్లానాయక్ కంటే ముందు రానా ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. కానీ కొవిడ్ సహా రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను పలుమార్లు మార్చారు. కొన్ని నెలల పాటు అసలు సినిమా వార్తల్లోనే లేకుండాపోయింది. ఒక దశలో ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేస్తున్నట్లు కూడా ప్రచారం సాగింది.
కానీ ఈ ప్రచారానికి తెరదించుతూ ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. జులై 1న విరాటపర్వంను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కానీ ఆ డేట్‌కు సినిమా రావట్లేదు. మరోసారి ఈ చిత్ర విడుదల తేదీ మారింది. అలాగని మళ్లీ వాయిదా అనుకుంటే పొరబాటే. ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందే విడుదల చేయబోతున్నారు. జూన్ 17న ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది.
జులై 1న పక్కా కమర్షియల్, రంగర రంగ వైభవంగా చిత్రాలు కూడా విడుదలవుతుండగా.. .జూన్ 17న రావాల్సిన పెద్ద సినిమా రామారావు-ఆన్ డ్యూటీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న వీకెండ్‌ను వాడుకోవడానికి విరాటపర్వం టీం రెడీ అయింది. సినిమా ఫస్ట్ కాపీతో ఎప్పుడో రెడీ అయిపోయింది కాబట్టి.. రిలీజ్ డేట్ ప్రిపోన్ చేయడానికి ఇబ్బంది లేకపోయింది.
ఇందుకు తగ్గట్లుగా ప్రమోషన్లు కూడా ప్లాన్ చేయబోతున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల ఈ సినిమాకు గతంలో ఉన్నంత బజ్ లేదు. కాబట్టి విడుదలకు ముందు కొంచెం గట్టిగానే ప్రమోషన్లు చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రానా సరసన సాయిపల్లవి నటించిన ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాడు.