ఆ ట్రైల‌ర్లో ధ‌నుష్‌.. రెండే రెండు సెక‌న్లు


తుల్లువ‌దో ఇల‌మై అనే చిన్న సినిమాలో ఒక మామూలు పాత్ర‌తో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యాడు ధ‌నుష్‌. ఆ సినిమాలో అత‌డి పాత్ర‌, లుక్స్ చూసి ఇత‌నేం హీరో అంటూ చాలామంది ఎగ‌తాళిగా మాట్లాడారు. కానీ రెండో సినిమా కాద‌ల్ కొండేన్‌తో త‌నలోని అద్భుత‌మైన పెర్ఫామ‌ర్‌ను బ‌య‌టికి తీసుకొచ్చి.. వీడేం యాక్ట‌ర్ రా బాబూ అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాడు ధ‌నుష్‌. ఇక ఆ త‌ర్వాత అత‌ను వెనుదిరిగి చూసుకుంది లేదు. కోలీవుడ్లో స్టార్‌గా ఎదిగాడు. బాలీవుడ్లో త‌న‌దైన ముద్ర వేశాడు. టాలీవుడ్లోనూ పేరు సంపాదించాడు. మొత్తంగా ఇండియా అంత‌టా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

ఆల్రెడీ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్’ అనే సినిమాతో అంత‌ర్జాతీయ ప్రేక్ష‌కుల‌నూ ప‌ల‌క‌రించాడు కానీ.. అది ఆశించిన స్పంద‌న తెచ్చుకోలేక‌పోయింది. కానీ ఇప్పుడు ఒక మెగా మూవీతో అత‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు. అదే.. ది గ్రే మ్యాన్.

‘ఎవెంజర్స్’తో పాటు ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రుసో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన సినిమా ఇది. ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవన్స్లాంటి టాప్ హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ధ‌నుష్ కూడా ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ఇంత‌కుముందే వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. సినిమా అనౌన్స్‌మెంట్ టైంలో, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు రిలీజ్ చేసిన‌పుడు ధ‌నుష్‌కు మంచి ప్రాధాన్య‌మే ద‌క్కింది. దీంతో ట్రైల‌ర్లోనూ ధ‌నుష్ బాగా హైలైట్ అవుతాడ‌ని అంతా అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. రెండు నిమిషాల ట్రైల‌ర్లో ధ‌నుష్ రెండు సెక‌న్లు మాత్ర‌మే క‌నిపించాడు.

రుసో బ్ర‌ద‌ర్స్ శైలికి త‌గ్గ‌ట్లే ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ధ‌నుష్ పాత్ర ఏంట‌న్న‌ది తెలియ‌డం లేదు. ట్రైల‌ర్లో ఒక చోట ధ‌నుష్ సూటేసుకుని ఒక్క క్ష‌ణం మామూలుగా క‌నిపించి.. ఇంకో క్ష‌ణం యాక్ష‌న్ సీన్‌తో మెరిశాడు. ట్రైల‌ర్లో ధ‌నుష్‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని ఆశించిన అభిమానుల‌కు ఇది నిరాశ క‌లిగించే విష‌య‌మే అయినా.. సినిమా చూడ‌కుండా ముందే ఒక అభిప్రాయానికి రావ‌డానికి వీల్లేదు. ట్రైల‌ర్లో మాదిరి కాకుండా సినిమాలో ధ‌నుష్ ప్ర‌త్యేక‌త చాటుకుంటాడ‌నే ఆశిద్దాం.