ప్రభాస్ డైరెక్టర్స్.. అయ్యో పాపం !

మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడికి రెండో సినిమాకు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో తో పాటు భారీ బడ్జెట్ దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా ? ప్రభాస్ వల్ల రెండో సినిమాకే ఆ అదృష్టం అందుకున్నారు సుజీత్ , రాధా కృష్ణ. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ కంటే ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇద్దరికీ రెండు పాన్ ఇండియా సినిమాలు చేతిలో పెట్టాడు ప్రభాస్. అయితే ఈ గోల్డెన్ చాన్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకోలేక సాదా సీదా సినిమాలు డెలివరీ చేసి సక్సెస్ అవ్వలేకపోయారు సుజీత్ , రాధాకృష్ణ.

నిజానికి ఈ ఇద్దరు దర్శకులు మొదటి సినిమాను బాగానే హ్యాండిల్ చేసి టాలెంటెడ్ డైరెక్టర్స్ గా పేరుతెచ్చుకున్నారు. ముఖ్యంగా సుజీత్… అప్పటి వరకూ వరుస అపజయాలతో సతమవుతున్న శర్వా కి ‘రన్ రాజా రన్’ తో సూపర్ హిట్ ఇచ్చాడు. ఇక ప్రభాస్ సినిమాతో మాత్రం మెప్పించలేకపోయాడు. ‘బాహుబలి 2’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘సాహో’ భారీ ఎక్స్ పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది. కాకపోతే నార్త్ లో యాక్షన్ ఎపిసోడ్ క్లిక్ అవ్వడంతో అక్కడ వంద కోట్ల మార్క్ అవలీలగా దాటేసింది. ఇక రాధా కృష్ణ కూడా ప్రభాస్ ఇచ్చిన లైఫ్ లైన్ ని వాడుకోలేకపోయాడు. గోపీచంద్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసి ‘జిల్’ తో హిట్ అందుకున్న రాధా కృష్ణ ‘రాధేశ్యామ్’ అంటూ ఓ ఆర్డినరీ కంటెంట్ తో సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు.

ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ని డైరెక్ట్ చేశాక వీరిద్దరి నెక్స్ట్ సినిమాలు ఏంటో తెలియని పరిస్థితి. అవును ‘సాహో’ తర్వాత సుజీత్ కి మెగా స్టార్ ‘లూసిఫర్’ రీమేక్ కోసం అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు. తర్వాత యూవీలో అలాగే డివీవీ ఎంటర్టైన్ మెంట్ లో సుజీత్ సినిమా అంటూ టాక్ వచ్చింది కానీ ఇంతవరకూ ఆ ప్రాజెక్ట్స్ మీద ఎలాంటి క్లారిటీ లేదు. రాధాకృష్ణ కూడా నెక్స్ట్ సినిమాను లాక్ చేసుకోలేదు. ఏదేమైనా ప్రభాస్ దర్శకులిద్దరూ రెండో సినిమాతో బోల్తా కొట్టి మూడో సినిమాకి ముప్పు తిప్పలు పడుతున్నారు. మరి త్వరలోనే ఈ దర్శకులు తమ టాలెంట్ ఏంటో చూపించి నెక్స్ట్ సినిమాతో సత్తా చాటితే బాగుంటుంది.