టాలీవుడ్ టాప్ స్టార్లలో కామెడీ బాగా ఎవరు చేస్తారు అంటే.. ఎక్కువ మంది నుంచి వచ్చే సమాధానం విక్టరీ వెంకటేష్‌దే. ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘన చరిత్ర ఉన్న వెంకీ.. కామెడీ టచ్ ఉన్న సినిమాల్లో ఒక మామూలు నటుడిలా మారిపోయి అద్భుతంగా కామెడీ పండిస్తారన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎఫ్-3 ప్రి రిలీజ్ ఈవెంట్లో వెంకీపై ప్రశంసల జల్లు కురిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకీ అంటే తనకెంతో ఇష్టమంటూ ఐలవ్యూ చెప్పిన అనిల్.. ఈ సీనియర్ నటుడి ప్రత్యేకతను గుర్తు చేశాడు.
వెంకటేష్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఒక కామెడీ సీన్ చేయాల్సి వస్తే ఇమేజ్ పూర్తిగా పక్కన పెట్టి ఒక చిన్న పిల్లాడిలాగా ఆ సన్నివేశాన్ని చేసి అందరినీ నవ్విస్తారని.. ఇలా చేయగల స్టార్ హీరో ఆయనొక్కరే అని, ఇంకెవరూ చేయలేరని అనిల్ తేల్చేశాడు. ఎఫ్-3 చాలా ఎక్కువమంది ఆర్టిస్టులతో చేసిన సినిమా అని.. రోజూ షూటింగ్‌లో 30 మంది ఆర్టిస్టులుంటే.. ఒకరు ముందు, ఒకరు వెనుక వస్తుంటారని.. ఐతే సెట్లో ఏ డిస్టబెన్స్ లేకుండా అందరినీ కూల్ చేసి ఎంటర్టైన్ చేసే బాధ్యతను వెంకీ తీసుకునేవారని అనిల్ చెప్పాడు.
ఎఫ్-3 సినిమాకు ఎఫ్-2నే పెద్ద శత్రువు అని, ఆ సినిమాను అంత బాగా ఆదరించిన నేపథ్యంలో దాన్ని మించి తర్వాతి సినిమా ఉండాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామని.. కొవిడ్‌లో మూడు దశలు దాటుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేశామని అనిల్ తెలిపాడు. ఈ రెండేళ్లు కరోనా వల్ల జనం ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. చాలా దాటుకుని వచ్చారని.. వాళ్లందరూ కూడా ఈ నెల 27న థియేటర్లలో ఎఫ్-3ని చూస్తే ఫుల్ రిలాక్స్ అవుతారని.. నవ్వించడం తప్ప ఈ సినిమా ఉద్దేశం ఇంకేమీ కాదని.. ఇందులో లాజిక్కులు ఉండవని, నవ్వులు మాత్రమే ఉంటాయని అనిల్ స్పష్టం చేశాడు.