స్టార్ హీరోలు లెక్చరర్ గా చేసిన పాత్రలు వాళ్లకు సూపర్ హిట్లు అందించిన దాఖలాలు చాలా ఉన్నాయి. వెంకటేష్ సుందరకాండ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సింహాలో ఫస్ట్ హాఫ్ బాలయ్య చేసింది పాఠాలు చెప్పే ఉద్యోగమే. మిరపకాయ్ లో రవితేజ పండించిన కామెడీని మర్చిపోగలమా. మెగా ఫ్యాన్స్ విషయానికి వస్తే కాలేజీ బ్యాక్ డ్రాప్ అనగానే మొదట గుర్తొచ్చే మూవీ మాస్టర్. 1997 సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. సరికొత్త చిరుని చూసి అభిమానులు పులకరించిపోయారు.
ఇప్పుడు పవర్ స్టార్ వంతు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ అధ్యాపకుడిగా కనిపిస్తారట. ఆ మేరకు దర్శకుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడీ సంగతి సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఈ పాత్ర భగత్ సింగ్ భావజాలంతో ఆయనకు వీరభక్తుడిగా కనిపిస్తుందని టాక్. అందుకే టైటిల్ కూడా అలా పెట్టారని వినికిడి. ఇన్నేళ్ల కెరీర్ లో పవన్ స్టూడెంట్ గా దర్శనమిచ్చాడు కానీ లెక్చరర్ గా ఎప్పుడూ కనిపించలేదు.
మొత్తానికి ఇది ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్ గా చెప్పొచ్చు. జూలై లేదా ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్న భవదీయుడు భగత్ సింగ్ విడుదలయ్యేది మాత్రం 2023లోనే. దానికన్నా ముందు హరిహర వీరమల్లు వస్తుంది. వినోదయ సితం రీమేక్ ని తక్కువ కాల్ షీట్స్ తో పూర్తి చేసేలా ఆల్రెడీ ప్లానింగ్ అయ్యింది. సో హరీష్ శంకర్ కి ఇంకొంత వెయిటింగ్ టైం తప్పక పోవచ్చు. గబ్బర్ సింగ్ లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో ప్రకటన స్టేజి నుంచే దీని మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates