ఎన్టీఆర్ 30.. తగ్గేదేలే


ఎన్టీఆర్ 30వ సినిమా గురించి చర్చ ఇప్పటిది కాదు. నిజానికి ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాల్సింది తారక్. అనౌన్స్‌మెంట్ రావడం, చర్చోపచర్చలు జరగడం అంతా అయ్యాక ఎందుకో ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయింది. తర్వాత కొరటాల శివతో సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చి ఏడాది దాటింది. కానీ ఆ ప్రకటన తప్పితే ఇంకే ఊసూ లేదు ఈ ఏడాది కాలంలో. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూసి చూసి అలసిపోయారు. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో తెలియక తికమక పడ్డారు.

ఐతే ఎట్టకేలకు అన్నీ సర్దుకుని జూన్ నెలాఖర్లో లేదా జులైలో షూటింగ్ మొదలవుతుందని వార్తలైతే వచ్చాయి కానీ.. సినిమా నుంచి ఇంకే అధికారిక అప్‌డేట్ లేదు. ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తున్నా సినిమా నుంచి ఏమైనా విశేషం బయటికి వస్తుందా అనే విషయంలో సందేహంతోనే ఉన్నారు తారక్ ఫ్యాన్స్. ఐతే వారి నిరీక్షణకు తెరదించుతూ, వారు కోరుకున్న దాని కంటే పెద్ద కానుకే ఇచ్చింది చిత్ర బృందం.

తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అభిమానుల ఆనందానికి అవధుల్లేని విధంగా, వారి అంచనాలను మించేలా ఈ గ్లింప్స్ ఉండడంతో హమ్మయ్య అనుకున్నారు. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు ఎంచుకున్న క్రూ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో అదిరిపోయే ఔట్ పుట్ రాబోతోందని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.

ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడతను మామూలు ఫాంలో లేడు. టీజర్ గ్లింప్స్‌లోనే అతను తనేంటో రుజువు చేశాడు. ఇక ఇండియాలోనే టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించాడు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలకే పని చేసే ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ సినిమాకు ఆర్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అలాగే శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ ఎడిటర్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. ఇలా అదిరిపోయే టెక్నికల్ సపోర్ట్ కుదరడంలో సినిమా ఓ రేంజిలో ఉండబోతోందని అభిమానులు మురిసిపోతున్నారు.