తెలుగులో అత్యధిక రీమేక్‌లు చేసిన పెద్ద హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా రాజశేఖర్ పేరు చెప్పేయొచ్చు. హీరోగా పీక్స్‌లో ఉన్న టైం నుంచి ఆయన రీమేక్‌లు చేస్తూనే వస్తున్నాడు. కెరీర్లో డౌన్ అయ్యాక మరింతగా ఆయన రీమేక్స్‌ను నమ్ముకున్నాడు. తమిళ, మలయాళ సినిమాలను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ.. మంచి మంచి సినిమాలు చూసి తెలుగులో చేస్తుంటాడు కానీ వాటిని సరిగా తీయడంలో ఫెయిలవడం వల్ల ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.
గత రెండు దశాబ్దాల్లో ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలు తప్ప మిగతా రీమేక్స్ అన్నీ ఆయనకు నిరాశనే మిగిల్చాయి. తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘సూదుకవ్వుం’ను తెలుగులో ‘గడ్డం గ్యాంగ్’గా తీస్తే దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఓ రీమేక్‌లో నటించారు. అదే.. శేఖర్. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు ఇది రీమేక్.
మెడికల్ మాఫియా చుట్టూ చాలా వినూత్నంగా, ఉత్కంఠభరితంగా సాగే సినిమా ‘జోసెఫ్’. జోజు జార్జ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. వీఆర్ఎస్ తీసుకున్న నడివయస్కుడైన పోలీస్.. తన కూతురి మరణం చుట్టూ నెలకొన్న మిస్టరీని ఛేదించే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది. కథలో ఎన్నో మలుపులుంటాయి. మంచి ఎమోషన్, అలాగే ఉత్కంఠ ఉంటుంది.
ఐతే ఒరిజినల్ ఎలా ఉన్నా ఇక్కడ రాజశేఖర్, జీవిత కలిసి ఆ సినిమా ఎలా తీశారన్నదే ప్రశ్నార్థకం. పైగా ఈ రోజుల్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చూడ్డానికి జనాలు థియేటర్లకు రావడం కష్టమైపోతోంది. ‘శేఖర్’కు బజ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ సినిమా ఆడకుంటే తాను అప్పులపాలవుతానంటూ రాజశేఖర్ ప్రేక్షకుల్లో సానుభూతి కోసం ప్రయత్నించాడు. అది అయినా ప్రేక్షకులను, ఆయన అభిమానులను కదిలించి థియేటర్లకు తీసుకొస్తుందేమో చూడాలి. ఇంతకీ ఈ సినిమాకు రివ్యూలు, మౌత్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రంతో పాటు బండ్ల గణేష్ సినిమా ‘డేగల బాబ్జీ’, సంపూర్ణేష్ బాబు మూవీ ‘ధగడ్ సాంబ’ కూడా రిలీజవుతున్నాయి కానీ.. వాటికి అసలే బజ్ లేదు.