ఈ తరం నటుల్లో అత్యుత్తమ డైలాగ్ డెలివరీ ఉన్న నటుడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు పేరుంది. ఈ విషయంలో చాలామంది సీనియర్ల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు తారక్. భాష మీద మంచి పట్టు ఉన్న తారక్.. చక్కటి వాచకంతో సంభాషణలు పలకడం ద్వారా అభిమానులతో పాటు అందరినీ మెప్పిస్తుంటాడు. ఐతే తెలుగు ఎన్టీఆర్ సంభాషణల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కానీ.. ఇప్పుడు వేరే భాషల్లో అతను చూపిస్తున్న పట్టు చర్చనీయాంశం అవుతోంది.
ఆల్రెడీ రెండేళ్ల కిందట ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర టీజర్‌కు తారక్ వివిధ భాషల్లో ఇచ్చిన వాయిస్ ఓవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత సినిమాలోనూ హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అతను చక్కటి డబ్బింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆయా భాషల్లో లోకల్ హీరోల స్థాయిలో పర్ఫెక్షన్ చూపించడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న కొత్త సినిమా టీజర్లోనూ తారక్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.
శుక్రవారం తారక్ పుట్టిన రోజు నేపథ్యంలో ముందు రోజు రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్‌లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు హైలైట్ అయింది తారక్ వాయిస్ ఓవరే. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు.. అవసరానికి మించి తను ఉండకూడదు అని, అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని… వస్తున్నా అంటూ సాగిన తారక్ డైలాగ్ వావ్ అనిపించింది.
ఐతే తెలుగులో ఈ డైలాగ్‌ను ఎంత బాగా పలికాడో.. ఇదే అర్థంతో హిందీ, తమిళం, కన్నడ భాషల్లో డైలాగ్‌ను కూడా అంతే చక్కటి ఉచ్ఛారణతో, స్పష్టతతో పలికి ఔరా అనిపించాడు తారక్. మంద స్వరంతో అతను ఆయా భాషల్లో పర్ఫెక్ట్‌గా డైలాగ్ పలకడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. తారక్ మామూలోడు కాదంటూ అందరూ కొనియాడుతున్నారు. ఒక్క మలయాళంలో మాత్రమే తారక్‌కు డబ్బింగ్ చెప్పించారు. ఈ సినిమాకు మలయాళంలో మినహా నాలుగు భాషల్లో తారకే డబ్బింగ్ చెప్పబోతున్నాడన్నది స్పష్టం.