మహేష్ బాబు 28లో మరో హీరో

ప్రస్తుతం సర్కారు వారి పాట ఫలితాన్ని ఆస్వాదిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ స్వరాలు సమకూర్చే బాధ్యతను తీసుకున్నాడు. అతడు లాంటి ఎవర్ గ్రీన్ సూపర్ హిట్, ఖలేజా లాంటి క్లాసిక్ మెమరీ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ అల వైకుంఠపురములో తర్వాత వస్తున్న త్రివిక్రమ్ మూవీ ఇది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో మరో హీరోకి స్కోప్ ఉందట. ఏదో సుశాంత్ తరహాలో చిన్నది కాకుండా చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంటుందని వినికిడి. దీనికి గాను ఇద్దరు ముగ్గురితో సంప్రదింపులు జరుగుతున్నాయట. అందులో మొదటి పేరు న్యాచురల్ స్టార్ నానిది వినిపిస్తోంది. తన క్యారెక్టర్ నచ్చితే మల్టీ స్టారర్ చేసేందుకు నాని మొహమాట పడడు. అందుకే నాగార్జునతో దేవదాస్ సాధ్యమయ్యింది. పైగా ఇది మాటల మాంత్రికుడి సినిమా. తనను ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసనే నమ్మకం ఉంటుంది.

అయితే ఇదంతా ప్రాధమిక దశలోనే ఉన్న చర్చల సారాంశం. ఇంకా ఫైనల్ కాలేదు. ఈ కారణంగానే రెగ్యులర్ షూటింగ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిసింది. లాక్ చేసుకున్నాక అనౌన్స్ మెంట్ రావొచ్చు. ఒకవేళ నాని నో అంటే నెక్స్ట్ ఆప్షన్ ఎవరో చూడాలి. సర్కారు వారి పాట వసూళ్ల సంగతి ఎలా ఉన్నా ఫైనల్ రిజల్ట్ పట్ల అభిమానులు ఏమంత సంతృప్తిగా లేరు. ముఖ్యంగా డివైడ్ టాక్ రావడం, అయిదో రోజు నుంచే కలెక్షన్లు తగ్గిపోవడం ఇబ్బంది పెట్టాయి. అందుకే త్రివిక్రమ్ సినిమా మీద మాములు ఆశలు పెట్టుకోవడం లేదు.