ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సర్ప్రైజ్ హిట్ అంటే.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రమే. 80, 90 దశకాల్లో కశ్మీర్లో హిందూ పండిట్ల మీద ఇస్లాం ఛాందసవాదులు జరిపిన హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది.
ఐతే బాక్సాఫీస్ సక్సెస్ పక్కన పెడితే.. ఈ సినిమాలో చూపించిన విషయాలపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చరిత్రకెక్కని దారుణాలను, పాలకుల తప్పులను చాలా బాగా చూపించారంటూ ఓ వర్గం ప్రశంసలు కురిపిస్తే.. ఇలాంటి సినిమాలు ప్రశాంతంగా బతుకుతున్న ప్రజల మధ్య విద్వేషాలకు కారణమవుతాయని మరో వర్గం విమర్శలు గుప్పించింది. కాగా సినిమా రిలీజైన కొన్ని నెలల తర్వాత జరిగిన పరిణామాలకు ఈ సినిమాకు ముడిపెడుతూ జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కశ్మీర్ ఫైల్స్‌పై విమర్శలు గుప్పించారు.
ఇటీవల కశ్మీర్ లోయలోని బుద్గాం ప్రాంతంలో రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దీనిపై ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలకు కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలే కారణమని, ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, దీనిపై తాను లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడానని.. ఇలాంటి సినిమాలను ఆపాలని కోరానని అన్నారు.
ఐతే తన సినిమాను తప్పుబట్టడంపై కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా స్పందించాడు. సరిగ్గా చెప్పారు ఫరూఖ్ సాబ్. కశ్మీర్ ఫైల్స్ లేకపోతే హిందువులపై హింసాకాండ జరిగేదే కాదు. మా సినిమా ద్వారానే కశ్మీర్ ప్రజలు రలివ్, గలివ్, చలివ్ (మారు, వెళ్లిపో, చచ్చిపో) పదాలు నేర్చుకున్నారు. లేదంటే అక్కడి అమాయక ప్రజలకు ఏం మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. అక్కడ పాకిస్థాన్ జెండా కూడా ఎగిరేది కాదు అంటూ సినిమాలో చూపించిన విషయాలకు ముడిపెడుతూ.. ఫరూఖ్‌కు వివేక్ కౌంటర్ ఇచ్చాడు.