30 ఏళ్ల తర్వాత మంచు శిఖరంలో మల్టీఫ్లెక్స్

చాలామందికి తెలీదు కానీ ఇది పచ్చి నిజం. జమ్ముకశ్మీర్ పేరు దేశ ప్రజలకు సుపరిచితం కావొచ్చు. కానీ.. అక్కడి జీవన విధానం మాత్రం మన అంచనాలకు భిన్నంగా ఉంటుంది. జమ్ము వరకు ఫర్లేదు కానీ కశ్మీర్ విషయంలో మాత్రం మనం ఊహించని ఎన్నో మనకు కనిపిస్తాయి. ఎక్కడి దాకానో ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో చిన్న ఊరులో అయినా ఒక టూరింగ్ టాకీసు ఉంటుంది. కానీ.. కశ్మీర్ లో మాత్రం అందుకు భిన్నంగా.

కశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ విషయానికే వస్తే.. ఆ నగరంలో గడిచిన మూడు దశాబ్దాలుగా ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. 1990లో ఉన్న ఉగ్రవాదుల ఉగ్ర హెచ్చరికలతో అక్కడ ఉన్న థియేటర్లను మూసేశారు. అప్పట్లో శ్రీనగర్ లో దాదాపు పది థియేటర్లు ఉండేవి. ఉగ్రవాదుల ప్రాబల్యం పెరిగిన తర్వాత వాటిని మూసేశారు. కట్ చేస్తే.. నేటి వరకూ థియేటర్ లేని పరిస్థితి. అంతేకాదు.. నైట్ లైఫ్ అంటే ఏమిటో అక్కడి వారికి అస్సలు తెలీదు.

ఇటీవల మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాలతో కశ్మీర్ ఉడికిపోయినట్లు కనిపించినా.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి తగ్గట్లే.. తాజాగా శ్రీనగర్ లో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మాణం జోరుగా సాగుతోంది. దీని నిర్మాణం పూర్తి అయ్యాక లైసెన్సు మంజూరు చేస్తారని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే 1990లో శ్రీనగర్ లో బాగా ప్రసిద్ధి చెందిన బ్రాడ్ వే సినిమా హాల్ కు (ఇప్పుడది మూత పడి ఉంది) ఎదురుగానే తాజా మల్టీఫ్లెక్స్ నిర్మాణం సాగుతుండటం గమనార్హం.

దీన్ని ధార్ కుటుంబానికి చెందిన ఎమ్‌ / ఎస్‌ తక్సల్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మిస్తోంది. ఇంతకాలం వినోదానికి దూరంగా ఉన్న కశ్మీరీ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పుగా అభివర్ణిస్తున్నారు. మరీ.. నిర్మాణం పూర్తి అయి ప్రారంభమయ్యాక ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఇప్పటివరకూ చెబుతున్న దాని ప్రకారం ఈ మల్టీఫ్లెక్సును 2021లో ప్రారంభిస్తారని చెబుతున్నారు. కశ్మీరీల లైఫ్ లో ఇదో కొత్త మలుపుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

OTT Streaming Dates on Amazon Prime, Netflix & Others