రవితేజ బ్లాక్‌బస్టర్‌పై వివాదం

మాస్ రాజా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ‘క్రాక్’. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కొవిడ్ ప్రభావం కొనసాగుతున్నా, 50 శాతం ఆక్యుపెన్సీ నడుస్తున్నా.. చాలా పెద్ద హిట్ అయింది. రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఐతే ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర కావస్తుండగా.. ఇప్పుడు దీని మీద ఒక వివాదం నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా కథను తన పుస్తకం నుంచి కాపీ కొట్టారంటూ హైదరాబాద్‌కు చెందిన శివ సుబ్రహ్మణ్యమూర్తి అనే రచయిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

తాను 2015లో ‘బళ్లెం’ సినిమా మీడియా డైరెక్టరీ’ అనే పుస్తకం రాశానని.. ‘క్రాక్’ సినిమాలో కథ, కథనం, కీలక సన్నివేశాలన్నీ ఈ పుస్తకం నుంచి కాపీ కొట్టినవే అని ఆ రచయిత ఆరోపించాడు. ఈ విషయమై ‘క్రాక్’ నిర్మాత, దర్శకుడు, హీరోలకు ఫిలిం ఛాంబర్ నుంచి నోటీసులు పంపించినా.. పట్టించుకోలేదని శివ సుబ్రహ్మణ్య మూర్తి చెప్పాడు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పాడు. ఐతే ఇలాంటి కాపీ వివాదాలు సినిమాల రిలీజ్ టైంలో బయటికి వస్తుంటాయి. విడుదలకు ముందు, లేదా రిలీజైన వెంటనే కాపీ ఆరోపణతో వార్తల్లోకి వస్తుంటారు రచయితలు. కానీ ఇలా సినిమా రిలీజైన 16 నెలలకు ఇలా కేసు నమోదు కావడం ఆశ్చర్యం.

కాగా ‘క్రాక్’ ఆంధ్రా ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అల్లుకున్నట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని అప్పట్లో చెప్పాడు. ఈ సినిమాకు కొంత మేర తమిళ చిత్రం ‘సేతుపతి’ ప్రేరణగా నిలిచింది. విడుదలకు ముందైతే ఆ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అనే ప్రచారం కూడా జరిగింది.

కానీ ఆ కథ, ఈ కథ వేరు. కొన్ని సన్నివేశాలు, హీరో క్యారెక్టరైజేషన్ వరకు కొంత పోలికలు కనిపిస్తాయి. మరి ఇప్పుడీ రచయిత సినిమా అంతా తన పుస్తకం నుంచి కాపీ కొట్టారని చేస్తున్న ఆరోపణలపై దర్శకుడు, నిర్మాత ఠాగూర్ మధు ఎలా స్పందిస్తారో చూడాలి.