ఇండస్ట్రీ టాక్.. కోట మాటలకు విలువుందా?

లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలబడిన నాగబాబు, చిరంజీవిలను ఆయన టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిగా నాగబాబు కూడా కోట గురించి అదుపు తప్పి మాట్లాడారు.

అదేదో ఎన్నికల వేడిలో జరిగింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఆయన అసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, రామ్ చరణ్‌ల గురించి నెగెటివ్ కామెంట్లు చేయడం చర్చనీయాంశం అవుతోంది. చిరంజీవి సినీ కార్మికుల కోసం ఆసుపత్రి కడతానంటే దాన్ని తప్పుబడుతూ ఆసుపత్రి ఎందుకు ముందు ఫుడ్డు పెట్టు అన్నారు.

మే డే వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా చిరు మాట మాత్రంగా తాను సినీ కార్మికుడిని అంటూ అది కూడా కోటకు పెద్ద బూతులాగా కనిపించడం విడ్డూరం. చిరు ఏనాడైనా ఎవరికైనా ఒక రూపాయి సాయం చేశాడా అని కూడా కోట ప్రశ్నించారు.

ఐతే కరోనా టైంలో కార్మికులను ఆదుకోవడానికి చిరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అందరికీ తెలిసిన విషయమే. ముందుగా తనే భారీ విరాళం ప్రకటించి ఇండస్ట్రీలో అందరూ ఆ దిశగా అడుగులు వేసేలా చేశారు. ఒక ఫౌండేషన్ నెలకొల్పి, ఒక టీంను ఏర్పాటు చేసి కార్మికులకు నిత్యావసరాలు అందించారు.

అలాగే భారీ ఖర్చుతో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతోమందికి తోడ్పాటు అందించారు. ఇవన్నీ కోటకు కనిపించకపోవడం విడ్డూరం. ఇక ‘రంగస్థలం’ సినిమాలో అంత గొప్పగా నటించిన రామ్ చరణ్‌ను మంచి నటుడు కాదు, పొటెన్షియాలిటీ కనిపించలేదు అనడంలో ఆంతర్యమేంటో కోటకే తెలియాలి.

ఈ ఇంటర్వ్యూలో పలుమార్లు మాట తడబడటం, పేర్ల కోసం తడుముకోవడం, కృష్ణగారి అబ్బాయి అంటూ సురేష్ బాబు పేరు చెప్పడం, మహేష్ పేరు కూడా గుర్తు లేకపోవడం, జూనియర్ ఎన్టీఆర్‌ను పొగుడుతూనే పొట్టి వాడు అంటూ చంద్రమోహన్‌తో పోల్చడం లాంటివి చూస్తే.. కోట ఆలోచన స్థాయి మీద సందేహాలు రేకెత్తిస్తోంది.

ఆయన మాటలను సీరియస్గా తీసుకోవాలా, వాటికి విలువ ఇవ్వాలా అన్నది జనాలే నిర్ణయించుకోవాలి. ఎంత గొప్ప నటుడైనప్పటికీ.. అసందర్భంగా ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చి అకారణంగా చిరు, చరణ్‌ల మీద ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ద్వారా కోట వ్యతిరేకతనే మూటగట్టుకుంటున్నారనే చెప్పాలి.