సుమకు యాంకర్‌గా ఉన్న పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే యాంకర్ కావడానికి ముందు ఆమె నటి అనే విషయం జనాలకు ఇప్పుడు గుర్తు లేకపోవచ్చు. సినిమాల్లోనే కాక సీరియళ్లలోనూ నటించింది సుమ. ఐతే యాంకర్‌గా ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అసామాన్యం. ఆ ఇమేజ్‌తోనే రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వచ్చిన సుమ.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటన వైపు అడుగులు వేసింది.
ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విజయ్ కలివరపు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. శ్రీకాకుళం నేపథ్యంలో, పూర్తిగా అక్కడి నేటివిటీతో నడిచే విలేజ్ డ్రామా ఇది. కొంచెం వైవిధ్యమైన కథాంశంతో కామెడీ, ఎమోషన్లు ప్రధానంగా ఈ సినిమాను అతను తీర్చిదిద్దాడు. ఐతే సుమ అండ్ టీం ఎంత గట్టిగా ప్రమోషన్లు చేసినా.. జనాలను ఈ సినిమా పెద్దగా ఆకర్షించలేకపోయింది.
చాలా తక్కువ థియేటర్లలో ‘జయమ్మ పంచాయితీ’ని రిలీజ్ చేయగా.. వాటిలోనూ ఆక్యుపెన్సీ లేకపోయింది. తొలి వీకెండ్లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అసలెక్కడా ‘జయమ్మ పంచాయితీ’ గురించి చర్చే లేదు. సోషల్ మీడియాలో కూడా దీని ఊసే లేదు. సినిమా ఎలా ఉందని చెప్పేవాళ్లే కరవయ్యారు. ఐతే ‘జయమ్మ పంచాయితీ’ చూసిన వాళ్లు ఇది తీసిపడేయదగ్గ చిత్రం కాదని.. శ్రీకాకుళం ప్రాంత నేపథ్యంలో అక్కడి మనుషుల తీరును చక్కగా చూపించారని, ఇందులో ఒక స్వచ్ఛత ఉందని అంటున్నారు. కాకపోతే థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేంత హంగామా సినిమాలో లేదని అంటున్నారు.
ఈ రోజుల్లో ఇలాంటి చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి వారిని థియేటర్లకు రప్పించడం కష్టం. పైగా దీనికి పోటీగా ఇంకో రెండు చిన్న సినిమాలు, అలాగే హాలీవుడ్ మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్’ కూడా రిలీజవడంతో దీన్ని అంతా ఇగ్నోర్ చేశారు. థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల దీనికి లభించిన ప్రయోజనం ఏమీ లేదు. దీని బదులు నేరుగా ఓటీటీలో వదిలి, బాగా ప్రమోట్ చేసి ఉంటే బాగుండేదని.. జనాలు బాగానే చూసేవారని, దాని గురించి చర్చ ఉండేదని, థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల మరుగున పడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.