మహేష్-సుక్కు.. ఆల్ క్లియర్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘1 నేనొక్కడినే’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యుండొచ్చు కానీ.. కంటెంట్ పరంగా చూస్తే అది ఒక కల్ట్ మూవీ అనే చెప్పాలి. మహేష్ కూడా ఈ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ గొప్పగా మాట్లాడతాడు. దీని దర్శకుడు సుకుమార్‌ను ఎంతో గౌరవిస్తాడు. ఆయన ప్రతిభ మీద నమ్మకంతో ‘1 నేనొక్కడినే’ ఫలితంతో సంబంధం లేకుండా ఇంకో సినిమా చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ఏం జరిగిందో ఏమో.. కొన్ని నెలల చర్చల తర్వాత ఈ సినిమా క్యాన్సిల్ అయింది. సుకుమార్ తర్వాత అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చేశాడు.

ఐతే సుక్కు, మహేష్ మధ్య ఏవో విభేదాలు రావడం వల్లే సినిమా క్యాన్సిల్ అయిందని, ‘మహర్షి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సుకుమార్‌ను ఉద్దేశించి కౌంటర్లు వేశాడని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. సుక్కుతో సినిమా క్యాన్సిల్ అయినపుడు.. తామిద్దరం కలిసి మళ్లీ పని చేస్తామని మహేష్ వ్యాఖ్యానించినప్పటికీ.. తర్వాత అలాంటి సంకేతాలే కనిపించకపోవడంతో ఇద్దరికీ చెడిందనే ప్రచారం ఊపందుకుంది.

ఇలాంటి టైంలో మహేష్ కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు సుక్కు. ఈ సందర్భంగా మహేష్ పక్కనే సుక్కు కూర్చుని చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యమే కనిపించింది. తర్వాత సుకుమార్ వేదిక మీదికి వచ్చి మహేష్ గురించి చాలా బాగా మాట్లాడాడు.

‘1 నేనొక్కడినే’ షూటింగ్ రోజులను తాను ఎప్పటికీ మరిచిపోలేనని.. మహేష్ సెట్స్‌లో దర్శకుడు కింగ్‌లాగా ఉంటాడని, దర్శకుడు మహారాజు లాగా ఫీలయ్యే కంఫర్ట్ అతను ఇస్తాడని.. ఇంకో టేక్ అన్నపుడు మహేష్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ చాలా ముద్దుగా ఉంటుందని అన్నాడు సుక్కు. అలాగే ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నానని.. మహేష్‌ను ఇంత జోవియల్‌గా, ప్లేఫుల్‌గా ఎప్పుడూ చూడలేదని.. సినిమాలోని మాస్ పాటను తాను ఎడిట్ రూంలో చూశానని.. ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని.. ఇలా మహేష్ గురించి, మహేష్ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు సుక్కు. మొత్తం ఈ ఈవెంట్ అంతా చూశాక మహేష్, సుక్కు మధ్య ఆల్ క్లియర్ అన్నట్లే కనిపించింది.