తమిళనాడులో అభిమానులు ప్రేమగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునే నయనతార పెళ్లి దర్శకుడు విగ్నేష్ శివన్ తో వచ్చే నెల 9న జరగనుంది. ఈ మేరకు తనే స్వయంగా డేట్ ని ప్రకటించడంతో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు. నిజానికి ఈ ఇద్దరు ఏడేళ్ల నుంచి సహజీవనంలో ఉన్నారు. మీడియా పలుమార్లు దీని గురించి ప్రశ్నించినా అవును ప్రేమించుకున్నాం అంటూ దాటవేత సమాధానం ఇస్తూ వచ్చారే తప్ప మూడు ముళ్ల గురించి మాత్రం ఎప్పుడూ సరైన సమాధానం ఇవ్వలేదు.
ఇప్పుడు తమ లాంగ్ లవ్ స్టోరీకి సరైన టర్నింగ్ తీసుకున్నారు. మోస్ట్ వెయిటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ గా నయన్ పెళ్లి ఎపిసోడ్ నిలవనుంది. కారణం లేకపోలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో శింబు, ప్రభుదేవాలతో ప్రయాణం తన ఇమేజ్ ని ఇబ్బందిలో పెట్టింది. అవి బ్రేకప్ అయినా కూడా తనేమి భయపడలేదు. సినిమాలు ఆపలేదు. దానికి తోడు ఇవి అయ్యాకే ఎన్నో బ్లాక్ బస్టర్లు తన సొంతమయ్యాయి. నయనతార ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా కోలీవుడ్ లో పేరుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార తెలుగులో త్వరలోనే చిరంజీవి గాడ్ ఫాదర్ లో కనిపించనుంది. జోడిగా కాదు కానీ కథకు కీలకమైన క్యారెక్టర్ ఇచ్చారు. కాబోయే భర్త దర్శకత్వంలో విజయ్ సేతుపతి సమంతాలతో చేసిన KRK ఇటీవలే రిలీజై పర్వాలేదనుపించుకుంది. తెలుగులో సోసోగానే ఆడింది. 2015లో వచ్చిన నానుం రౌడీ దాన్(నేను రౌడీనే) నుంచి విగ్నేష్ నయన్ ల ప్రేమకథకు శ్రీకారం పడింది. అందులో నయనే హీరోయిన్. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత పెళ్లి పుస్తకం దాకా చేరింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates