ఈగ, లెజెండ్, ఊహలు గుసగుసలాడే లాంటి హిట్లతో నిర్మాతగా ఆరంభంలో మెరుపులు మెరిపించాడు సాయి కొర్రపాటి. రాజమౌళితో అత్యంత సాన్నిహిత్యం ఉన్న ఆయన.. ఈగ లాంటి భారీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సినిమాతో తన అభిరుచిని చాటుకోవడంతో పాటు ఆర్థికంగానూ మంచి ఫలితాన్నందుకున్నాడు.
ఆ తర్వాత ఆయన నిర్మించిన సినిమాలు కొన్ని తన ప్రత్యేకతను చాటాయి. కానీ ఒక దశ దాటాక అభిరుచి మాత్రమే కనిపించి.. బాక్సాఫీస్ ఫలితం మాత్రం తిరగబడటం మొదలైంది. దిక్కులు చూడకు రామయ్యా, తుంగభద్ర, రాజా చెయ్యి వేస్తే, మనమంతా, పటేల్ సార్, యుద్ధం శరణం.. ఇలా చాలా పరాజయాలు ఎదుర్కొన్నారు సాయి. మధ్య మధ్యలో రాజు గారి గది, జ్యో అచ్యుతానంద లాంటి సినిమాలు మంచి ఫలితాన్నిచ్చినా మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్లుగా నిలిచాయి. దీంతో ఆయన జోరు తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గించేశారు.
కేజీఎఫ్, కేజీఎఫ్-2ల డిస్ట్రిబ్యూషన్‌తో మంచి లాభాలు అందుకున్న ఆయన.. మళ్లీ ఇప్పుడు ప్రొడక్షన్లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీ విష్ణు హీరోగా భళా తందనాన చిత్రాన్ని నిర్మించారు. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్లాపుల్లో హీరోను, డైరెక్టర్‌ను నమ్మి చెప్పుకోదగ్గ బడ్జెట్లోనే ఈ సినిమాను నిర్మించారు సాయి. వారితో పాటు ఆయనకూ హిట్ చాలా అవసరమైన స్థితిలో భళా తందనాన బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతోంది.
ఒకప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకున్న సాయి.. ఇప్పుడు అది పూర్తిగా పోగొట్టుకున్నారు. రాజమౌళి వచ్చిన తన ఫ్రెండు సినిమా గురించి గొప్పగా చెబితే తప్ప జనాల దృష్టి దీని మీద పడలేదు. జక్కన్న కూడా సాయి తీసే ప్రతి సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఆయన సినిమాలకు ఎలివేషన్ ఇస్తూనే ఉన్నాడు. కానీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు. ఆయన మాటలకు, సినిమాలో విషయానికి పొంతన ఉండటం లేదు. మరి భళా తందనాన అయినా ఈ ట్రెండును మార్చి జక్కన్న చెప్పిన స్థాయిలో ఉండి, సాయికి మంచి హిట్టిస్తుందేమో చూడాలి.