రెండు నెలల కిందట ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా రిలీజైనపుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు సినీ చరిత్రలోనే అతి గొప్ప నటుల్లో ఒకడు.. 500కు పైగా చిత్రాల్లో నటించి 80, 90 దశకాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు చూసిన మోహన్ బాబు నటించిన సినిమాకు మెజారిటీ థియేటర్లలో కనీసం పది మంది కూడా ప్రేక్షకులు లేని దయనీయమైన పరిస్థితి తలెత్తింది.
అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలా థియేటర్లలో ముందు రోజు వరకు ఒక్క టికెట్ కూడా అమ్ముడు కాకపోవడం.. కొన్ని థియేటర్లలో 1, 2 టికెట్లు తెగడం పట్ల విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీని మీద ఎన్ని జోకులు పేలాయో.. ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్క లేదు. ఐతే ‘మా’ ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీతో మంచు వారి కయ్యం నేపథ్యంలో ఈ ట్రోలింగ్‌ను వెనుక ఉండి నడిపించింది మెగా అభిమానులే అని మంచు వారు బలంగా నమ్మారు. ఈ ట్రోలింగ్ మీద ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.
కట్ చేస్తే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా రిలీజైంది. ఈ చిత్రానికి తొలి రోజు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. డే-1 కలెక్షన్లు బాగానే ఉన్నా.. తర్వాత ఈ చిత్రం చతికిలపడింది. వీకెండ్లోనే సరైన వసూళ్లు సాధించలేకపోయింది. వారాంతం అయ్యాక పరిస్థితి దయనీయంగా తయారైంది. బుకింగ్స్ దారుణాతి దారుణంగా తయారయ్యాయి.
దీంతో ఇప్పుడు మంచు ఫ్యామిలీ మద్దతుదారులు, అభిమానులు రంగంలోకి దిగారు. ‘ఆచార్య’ మీద వారి స్థాయిలో వాళ్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. వివిధ నగరాల్లో ‘ఆచార్య’కు అడ్వాన్స్ బుకింగ్స్ మరీ కనీస స్థాయిలో ఉండటంపై స్క్రీన్ షాట్లు తీసి.. రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. వీరికి వేరే మెగా యాంటీ ఫ్యాన్స్ కూడా తోడవుతున్నారు. అందరూ కలిసి మెగా ఫ్యామిలీ సినిమా మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి కౌంటర్లు వేస్తున్నారు. వాళ్లు ట్రోల్ చేశారని కాదు కానీ.. ‘ఆచార్య’కు బాక్సాఫీస్ దగ్గర మరీ ఇంత దయనీయమైన పరిస్థితి ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.