కొత్త సినిమాలొద్దు.. పాతవి ముద్దు

దేశవ్యాప్తంగా ఇప్పుడు సినిమాల విషయంలో చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. కొత్తగా పేరున్న సినిమాలు రిలీజవుతున్నా.. జనాలు వాటిని పట్టించుకోవడం లేదు. కొత్తవి వద్దు, పాతవి ముద్దు అని ఎప్పుడెెప్పుడో రిలీజైన సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. కొత్త చిత్రాలపై శీత కన్నేస్తున్నారు. గత వారాంతంలో వివిధ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలే రిలీజయ్యాయి. తెలుగు విషయానికి వస్తే ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రం విడుదలైంది. కానీ ఆ చిత్రం ప్రేక్షకులకు రుచించలేదు.

నెగెటివ్ టాక్‌తో మొదలైన ‘ఆచార్య’ తొలి రోజు వరకు సందడి చేసింది. రెండో రోజు చల్లబడిపోయింది. వీకెండ్లో కూడా సరైన వసూళ్లు రాబట్టలేకపోయిందీ చిత్రం. ఇక హిందీలో అజయ్ దేవగణ్ సినిమా ‘రన్ వే 34’, టైగర్ ష్రాఫ్ మూవీ ‘హీరోపంటి-2’ మంచి అంచనాల మధ్యే రిలీజయ్యాయి. వీటిలో అజయ్ సినిమాకు టాక్ బాగుండగా, టైగర్ మూవీని విమర్శకులు చీల్చిచెండాడారు. సామాన్య ప్రేక్షకులు కూడా దీని మీద విమర్శలు గుప్పించారు.

ఈ రెండు చిత్రాల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ‘రన్ వే 34’ వసూళ్లు తొలి రోజుతో పోలిస్తే తర్వాతి రెండు రోజుల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయట్లేదీ చిత్రం. హీరో పంటి-2 రెండో రోజు నుంచి క్రాష్ అయిపోయింది. ఈ కొత్త సినిమాలను మించి ‘కేజీఎఫ్-2’ అనే డబ్బింగ్ సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ వసూళ్లలో రెండు కొత్త హిందీ చిత్రాలను మించి ‘కేజీఎఫ్-2’కే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం. యశ్ సినిమాకు మూడో వీకెండ్లో హిందీలో రూ.16 కోట్ల నెట్ వసూళ్లు వస్తే.. ‘రన్ వే 34’ వసూళ్లు రూ.13 కోట్ల దగ్గరే ఉన్నాయి.

‘హీరోపంటి-2’ వసూళ్లు అటు ఇటుగా రూ.10 కోట్లున్నాయి. ఇక తెలుగు మార్కెట్ విషయానికి వస్తే.. నాలుగు వారాల కిందట విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’, రెండు వారాల ముందు వచ్చిన ‘కేజీఎఫ్-2’కు ఇంకా మంచి ఆక్యుపెన్సీ వస్తోంది. తక్కువ థియేటర్లలోనే ఆడుతున్నప్పటికీ.. ‘ఆచార్య’ థియేటర్ల కంటే ఆ రెండు చిత్రాల స్క్రీన్లలోనే సందడి కనిపిస్తోంది. మరోవైపు తమిళంలో విజయ్ సేతుపతి-సమంత-నయనతారల ‘కేఆర్కే’ ఓ మోస్తరు వసూళ్లే రాబడుతుండటా.. అక్కడ ‘కేజీఎఫ్-2’ హవా నడుస్తోంది ఇప్పటికీ.