టికెట్ల రేట్ల దెబ్బ.. తెలుస్తోందా?

క‌రోనా వ‌ల్ల సినీ రంగం బాగా దెబ్బ తింద‌న్న కార‌ణం చూపి తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి అనుమ‌తులు తెచ్చుకుంది టాలీవుడ్. సినిమా వాళ్లు అడ‌గ్గానే ప్ర‌భుత్వం కూడా ఉదారంగా రేట్లు పెంచుకునే సౌల‌భ్యం క‌ల్పించేసింది. ఐతే ప్రేక్ష‌కుల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది మాత్రం ఎవ‌రూ ఆలోచించ‌లేదు. క‌రోనా టైంలో అస‌లే థియేట‌ర్ల‌కు వెళ్లే అల‌వాటు త‌ప్పింది. ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. సినిమా చాలా బాగుందంటే, పెద్ద తెర‌ల్లో మాత్ర‌మే చూడాల‌న్న అభిప్రాయం క‌లిగించే చిత్రాల‌కు త‌ప్ప థియేట‌ర్ల‌కు వెళ్లని ప‌రిస్థితి వ‌చ్చేసింది.

రెగ్యుల‌ర్‌గా థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఫ్యామిలీ ఆడియ‌న్స్ శాతం త‌గ్గింద‌న్న‌ది స్ప‌ష్టం. అలాగే ఒక సినిమాను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ‌ట‌మూ త‌గ్గిపోయింది. వీటిని దృష్టిలో ఉంచుకుని మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి ఏం చేయాల‌ని చూడ‌కుండా టికెట్ల రేట్ల‌ను అసాధార‌ణంగా పెంచేశారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాల సంగ‌తి వేరు. ఎంత రేటు పెట్టి అయినా చూడాల‌న్న కోరిక ప్రేక్ష‌కుల్లో ఉంటుంది. టికెట్ల ధ‌ర‌కు న్యాయం చేసే ఎక్స్‌పీరియ‌న్స్ కూడా అలాంటి సినిమాలు ఇస్తాయి. అలాంటి సినిమాల‌కు కూడా రేట్ల విష‌యంలో జ‌నాలు తిట్టుకుంటూనే త‌ప్ప‌ద‌న్న‌ట్లు థియేట‌ర్ల‌కు వెళ్తున్నారు. కానీ మామూలు సినిమాల‌కు ఒక టికెట్ మీద‌ 300-400 పెట్టి సినిమా చూడాలంటే ఎలా? రాధేశ్యామ్ సినిమాకు భారీ రేట్లే చేటు చేశాయి.

వీకెండ్లోనే సినిమా చ‌తికిల‌ప‌డింది. మిష‌న్ ఇంపాజిబుల్, గ‌ని లాంటి చిత్రాలు వాషౌట్ అయిపోయాయంటే ప‌రోక్షంగా  టికెట్ల ధ‌ర‌లు కూడా ఒక కార‌ణ‌మే. ఇప్పుడు ఆచార్య కూడా ఈ ప్ర‌భావాన్ని చూస్తోంది. గ‌తంలో ఎలాంటి ఫ్లాప్ సినిమాకు అయినా మినిమం క‌లెక్ష‌న్లు ఉండేవి. టికెట్ల రేట్లు రీజ‌న‌బుల్‌గా ఉన్న‌పుడు జ‌నాలు బాలేని సినిమాకు కూడా రిగ్రెట్ అయ్యేవారు కాదు. టాక్ కోసం చూసేవారు కాదు. వేస‌విలో అయితే ఏసీల చ‌ల్ల‌ద‌నం కోసం, టైంపాస్ కోస‌మైనా వెళ్లి థియేట‌ర్ల‌లో కూర్చునేవారు. కానీ ఇప్పుడు మినిమం రూ.200 పెట్టి ఎవ‌రెళ్తారు? స‌మంత సినిమా కేఆర్కే చూడ్డానికి కొన్ని మ‌ల్టీప్లెక్సుల్లో ఇంట‌ర్నెట్ ఛార్జీల‌తో క‌లిపి రూ.330 చెల్లించాలంటే ఎవ‌రు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తారు?

ఆచార్య లాంటి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాను సింగిల్ స్క్రీన్ల‌లో రూ.250, మ‌ల్టీప్లెక్సుల్లో రూ.350-400 పెట్టి ఎంత‌మంది చూస్తారు? మామూలుగానే రేట్లు పెరిగిపోయాయంటే.. పెద్ద సినిమాల‌కు అద‌నంగా వ‌డ్డించ‌డం ప్రేక్ష‌కులను దోచుకోవ‌డం కాక మ‌రేంటి? ఇది ఆడియ‌న్స్‌కు ఎంత కోపం తెప్పిస్తుందో ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు అర్థ‌మ‌వుతోందా? ఆ ప్ర‌భావ‌మే చిన్న‌, మీడియం రేంజ్ సినిమాలు, టాక్ బాలేని చిత్రాల కొంప ముంచుతోంది. ఆర్ఆర్ఆర్ లాంటి ఒక‌టీ అరా సినిమాల‌కు ఈ రేట్ల పెంపువ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండొచ్చు కానీ.. మిగ‌తా వాటికి మాత్రం ఈ పెంపు ఇది గొడ్డ‌లిపెట్టు అన్న‌ట్లే. ఈ రేట్ల పెంపుతో మున్ముందు థియేట‌ర్ల మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థకంగా మారితే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.