అజయ్ దేవగణ్‌కు గర్వభంగం

ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కన్నడ కథానాయకుడు సుదీప్ మధ్య నడిచిన ‘హిందీ’ గొడవ గురించి తెలిసిందే. హిందీ ఇంకెంతమాత్రం జాతీయ భాష కాదంటూ ఓ వేడుకలో సుదీప్ వ్యాఖ్యానించడం.. తర్వాత అజయ్ దేవగణ్ ట్విట్టర్లో దీనిపై కొంచెం ఘాటుగానే స్పందించడం.. దానికి సుదీప్ కౌంటర్ ఇవ్వడం జరిగాయి. హిందీ మన మాతృ భాష, జాతీయ భాష అని నొక్కి వక్కాణించడం, హిందీలోకి దక్షిణాది చిత్రాలను డబ్బింగ్ చేయడం గురించి నిలదీయడం దక్షిణాది జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

రాజకీయ నాయకులు సైతం ఈ ట్వీట్ మీద అజయ్‌ను గట్టిగా నిలదీశారు. ఐతే ఈ ట్వీట్ వెనుక అజయ్ ఉద్దేశం వేరంటూ వార్తలొచ్చాయి. అస్సలు బజ్ లేని తన కొత్త చిత్రం ‘రన్ వే 34’ను వార్తల్లో నిలబెట్టడానికి అజయ్ ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని రాజేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ గొడవ వల్ల దక్షిణాది జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం తప్ప సినిమాకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయాడు అజయ్.

‘రన్ వే 34’కు మంచి టాక్ అయితే వచ్చింది కానీ.. ఆ చిత్రం ప్రేక్షకులను తొలి రోజు థియేటర్లకు మాత్రం రప్పించలేకపోయింది. శుక్రవారం ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఒక పెద్ద హీరో నటించిన హిందీ చిత్రానికి ఈ వసూళ్లు చాలా చాలా తక్కువ. దీనికి పోటీగా శుక్రవారం రిలీజైన మరో హిందీ చిత్రం ‘హీరో పంటి-2’కు డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా అజయ్ సినిమా మీద డబుల్ నెట్ వసూళ్లు సాధించింది.

ఇక ఇదే రోజు రిలీజైన తెలుగు సినిమా ‘ఆచార్య’కు వరల్డ్ వైడ్ రూ.30 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే అజయ్ సినిమా పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. రెండు వారాల ముందు రిలీజైన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్-2’ హిందీలో శుక్రవారం రూ.4 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో తన ట్వీట్‌తో కన్నడ స్టార్ సుదీప్‌ను రెచ్చగొట్టి పైచేయి సాధించాననుకున్న అజయ్‌కు ఇప్పుడు ఓ కన్నడ సినిమా వల్ల గర్వభంగం అయిందనే చెప్పాలి.